USA: అమెరికా ‘స్పెల్లింగ్ బీ’ పోటీలో విజేతగా భారత సంతతి టీనేజర్
- ‘స్పెల్లింగ్ బీ’లో గెలిచి 50 వేల డాలర్లు సొంతం చేసుకున్న దేవ్ షా
- సామోఫైల్ పదానికి సరైన స్పెల్లింగ్ చెప్పడంతో విజయం కైవసం
- పోటీల్లో గెలిచినందుకు సంబర పడ్డ భారత సంతతి టీనేజర్
- ఇది అస్సలు నమ్మలేకపోతున్నానని వ్యాఖ్య
అమెరికాలో జరిగిన నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలో విజేతగా ఓ భారత సంతతి టీనేజర్ నిలిచాడు. సామోఫైల్ పదానికి కరెక్ట్‌గా స్పెల్లింగ్ చెప్పిన దేవ్ షా (14) 50 వేల డాలర్ల నగదు బహుమానం గెలుచుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ పోటీలో ఈమారు మొత్తం 11 లక్షల మంది పాల్గొన్నారు. తుది దశకు చేరుకున్న 11 మందిలో దేవ్ షా కూడా ఒకరు. గత 24 ఏళ్లలో ఈ పోటీల్లో గెలిచిన 22వ దక్షిణాసియా సంతతి వ్యక్తిగా దేవ్ షా నిలిచాడు. డిక్షనరీ ప్రకారం, మట్టిలో వుండే జీవుల్ని సామోఫైల్ అని అంటారు.
‘స్పెల్లింగ్ బీ’ విజేతగా నిలిచినందుకు దేవ్ షా సంబరపడిపోయాడు. ‘‘ఇది అస్సలు నమ్మలేకపోతున్నాను. నా కాళ్లు వణుకుతున్నాయి’’ అని వ్యాఖ్యానించాడు. ఇక వర్జీనియా రాష్ట్రానికి చెందిన షార్లెట్ వాల్ష్ ఈ పోటీలో రెండో స్థానంలో నిలిచింది.
1924లో అమెరికాలో ‘నేషనల్ స్పెల్లింగ్ బీ’ ప్రారంభమైంది. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా ఈ పోటీల్లో భారత సంతతి విద్యార్థులే ముందు వరుసలో నిలుస్తున్నారు. ఎనిమిదవ తరగతి లోపు విద్యార్థులు అందరూ ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. పోటీల్లో అడిగే కఠినమైన ఆంగ్ల పదాల అక్షర క్రమాన్ని సరిగ్గా చెప్పే వారు విజేతలు అవుతారు. గత ఏడాది టెక్సాస్‌లో జరిగిన పోటీల్లో హరిణి లోగన్ విజేతగా నిలిచింది. మరో భారత అమెరికన్ విక్రమ్ రాజుపై ఆమె గెలుపొందింది.