fixed deposit: వడ్డీ రేట్లు తగ్గడం అప్పుడే మొదలైందా?
- యాక్సిస్ బ్యాంక్, పీఎన్ బీ నుంచి రేట్ల తగ్గింపు
- 0.20 శాతం వరకు తగ్గిన రేట్లు
- రూ.2,000 నోట్ల రూపంలో భారీగా డిపాజిట్లు
- దీంతో బ్యాంకుల అనూహ్య నిర్ణయం
చాలా ఏళ్ల విరామం తర్వాత వడ్డీ రేట్లు పెరగడం 2022 మే నెల నుంచే మొదలైంది. అప్పటి నుంచి విడతలవారీగా ఆర్ బీఐ రెపో రేటును 2.5 శాతం పెంచింది. రెపో రేటు పెంచడంతో బ్యాంకులు సైతం తాము ఇచ్చే రుణాలపై, డిపాజిట్లపై రేట్లను పెంచుతూ వచ్చాయి. కాకపోతే ఆర్ బీఐ గత సమీక్ష సందర్భంగా వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచేసింది. రేట్లను పెంచలేదు, తగ్గించలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివర్లో అంటే 2024 ఆరంభంలో ఆర్ బీఐ తిరిగి రెపో రేటును తగ్గిస్తుందన్న అంచనాలు ఉన్నాయి.
ఆర్ బీఐ మాదిరే డిపాజిట్లు, రుణాలపై రేట్లను బ్యాంకులు ఇంతకాలం పెంచుతూ వచ్చాయి. కానీ, ఇప్పుడు బ్యాంకులు రివర్స్ మోడ్ తీసుకున్నట్టున్నాయి. అప్పుడే డిపాజిట్లపై రేట్లను తగ్గించడం మొదలు పెట్టేశాయి. యాక్సిస్ బ్యాంక్ ఫిక్స్ డ్ డిపాజిట్లపై రేటును 0.20 శాతం తగ్గించింది. 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు కాల వ్యవధి కలిగిన డిపాజిట్లపై 3.5 శాతం నుంచి 7.10 శాతం మధ్య ఆఫర్ చేస్తోంది.
ఏడాది ఐదు రోజుల నుంచి పదమూడు నెలల వరకు డిపాజిట్లపై రేటును 7.10 శాతంగా ఉంటే, 6.80 శాతానికి తగ్గించింది. ఇలా ఒక్కో కాల వ్యవధిపై తగ్గింపు ఒక్కో మాదిరిగా ఉంది. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ సైతం వేర్వేరు కాలవ్యవధి డిపాజిట్ల రేట్లను సవరించింది. 0.20 శాతం వరకు తగ్గించింది. ఆర్ బీఐ వడ్డీ రేట్లను సవరించకుండా, అప్పుడే బ్యాంకులు రేట్లను తగ్గించడం వెనుక.. రూ.2,000 నోట్ల రూపంలో పెద్ద ఎత్తున డిపాజిట్లు వస్తుండడమే కారణమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.