ys bhaskar reddy: వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
- భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ వేయాలని సీబీఐకి కోర్టు ఆదేశం
- విచారణ ఈ నెల 5వ తేదీకి వాయిదా
- కుట్ర, సాక్ష్యాలను చెరిపివేశారన్న ఆరోపణలతో ఏప్రిల్ 16న అరెస్టయిన భాస్కర్ రెడ్డి
వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను నాంపల్లిలోని సీబీఐ కోర్టు ఈ రోజు విచారించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ అధికారులను ఆదేశించింది. తర్వాత విచారణను ఈ నెల 5వ తేదీకి సీబీఐ కోర్టు వాయిదా వేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కుట్రతోపాటు సంఘటనా స్థలంలో సాక్ష్యాధారాల చెరిపివేతలో కీలక పాత్ర పోషించారంటూ భాస్కర్ రెడ్డిని సీబీఐ ఏప్రిల్ 16న అరెస్టు చేసింది.
ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో భాస్కర్ రెడ్డి ఉన్నారు. తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ‘‘సీబీఐ దాఖలు చేసిన అభియోగ పత్రంలో నా పాత్రకు సంబంధించి ఎలాంటి ఆరోపణలు లేవు. సాక్ష్యాల చెరిపివేతతో నాకు ఎలాంటి సంబంధంలేదు. ఆధారాలు లేకున్నా నన్ను అరెస్టు చేసి అక్రమంగా నిర్బంధించారు. నా ఆరోగ్యం సరిగా లేదు’’ అని భాస్కర్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు.
మరోవైపు ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, శివశంకర్ రెడ్డి కూడా సీబీఐ కోర్టులో విచారణకు హాజరయ్యారు. ఈ కేసు విచారణను సీబీఐ కోర్టు ఈనెల 16వ తేదీకి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వివేకా హత్య కేసులో ఏప్రిల్ 16న భాస్కర్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. ఏప్రిల్ 19 నుంచి 24వ తేదీ వరకు కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపింది. ఏప్రిల్ 24 నుంచి ఆయన చంచల్‌గూడ జైలులో ఉంటున్నారు. ఈ క్రమంలో భాస్కర్‌రెడ్డి గత వారం అస్వస్థతకు గురవ్వగా.. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స అందించారు. తర్వాత నిమ్స్‌కు తరలించి.. పలు వైద్య పరీక్షలు చేశారు. అనంతరం జైలుకు తరలించారు.