Telangana: బ్రాహ్మణ విద్యార్థులకు కేసీఆర్ తీపి కబురు
- ఐఐటీ, ఐఐఎం లాంటి ప్రసంస్థల్లో చదివే బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంటు
- వేద పాఠశాలల నిర్వహణకు 2 లక్షల రూపాయిల వార్షిక గ్రాంటు
- ఈ నెల 24 నుంచి పోడు భూముల పట్టాల పంపిణీ ఉంటుందన్న సీఎం
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను సీఎం కేసీఆర్ ఈ రోజు నూతన సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. జాతీయ జెండా ఎగురవేసి, సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత తొమ్మిదేళ్ళలో అనేక అభివృద్ది, సంక్షేమ పథకాలతో రాష్ట్రం అభివృద్దికి స్వర్ణ యుగంగా నిలిచిందని కొనియాడారు. మరిన్ని పథకాలను అమలు చేయనున్నట్టు తెలిపిన సీఎం కేసీఆర్ బ్రాహ్మణులు, బ్రాహ్మణ విద్యార్థులకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో వేద పాఠశాలల నిర్వహణకు 2 లక్షల రూపాయిల వార్షిక గ్రాంటు అందజేస్తామన్నారు.
ఐఐటీ, ఐఐఎం లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చదివే బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంటు ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అలాగే, ఈ నెల 24 నుంచి పోడు భూముల పట్టాల పంపిణీని ప్రారంభిస్తామని ప్రకటించారు. కొన్ని జిల్లాల్లో అమల్లో ఉన్న కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పథకాన్ని రాష్ట్రంలో మిగిలిన 24 జిల్లాలకూ విస్తరిస్తామని తెలిపారు. బీసీ కుల వృత్తుల వారికి లక్ష రూపాయిల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. గృహలక్ష్మి పథకాన్ని వెచ్చే నెల నుంచి అమలు చేస్తామన్నారు. మహిళల ఆరోగ్య కోసం చేపట్టిన ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని రాష్ట్రం మరో 1200 ఆసుపత్రుల్లో అమలు చేస్తామని వెల్లడించారు.