CEC: తెలంగాణ సహా ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల సీఈవోలకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు
- త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు
- ఆయా రాష్ట్రాల్లో బదిలీలు, పోస్టింగులపై నివేదిక ఇవ్వాలన్న సీఈసీ
- ఎన్నికల అధికారులు సొంత జిల్లాల్లో విధులు నిర్వర్తించడంపై నిషేధం
- ప్రస్తుతం ఉన్న పోస్టులో మూడేళ్లకు మించి ఉండరాదని నిబంధన
మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల సమయం సమీపించింది. ఈ నేపథ్యంలో, ఆయా రాష్ట్రాల్లో బదిలీలు, పోస్టింగులపై జులై 31వ తేదీ లోపు నివేదిక ఇవ్వాలని సీఈవోలకు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ఎన్నికల అధికారులు సొంత జిల్లాల్లో విధులు నిర్వర్తించరాదని, ప్రస్తుతం ఉన్న పోస్టుల్లో మూడేళ్లకు మించి ఉండరాదని తాజా నిబంధనలు తీసుకువచ్చింది. క్రిమినల్ కేసులు లేవని అధికారుల నుంచి డిక్లరేషన్ తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అభ్యర్థుల్లో తమ బంధువులు లేరని కూడా అధికారుల నుంచి డిక్లరేషన్ తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.