Indian Railways: ఒడిశా రైలు ప్రమాదం: 18 రైలు సర్వీసులు తాత్కాలికంగా రద్దు
- ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో పలు దూరప్రాంత రైలు సర్వీసుల రద్దు
- మరికొన్ని రైళ్ల దారి మళ్లింపు
- గోవా-ముంబై ‘వందేభారత్’ రైలు ప్రారంభోత్సవం కూడా వాయిదా
ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో ఆ మార్గంలోని పలు రైలు సర్వీసులు తాత్కాలికంగా రద్దయ్యాయి. మొత్తం 18 దూరప్రాంత రైళ్లను రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. హౌరా-పూరీ సూపర్‌ఫాస్ట్ (12837), హౌరా-బెంగళూరు సూపర్ ఫాస్ట్ (12893), హౌరా-చెన్నై మెయిల్ (12839), హౌరా-సికింద్రాబాద్ (12703), హౌరా-హైదరాబాద్ (18045), హౌరా-తిరుపతి (20889), హౌరా-పూరీ సూపర్‌ఫాస్ట్ (12895), హౌరా-సంబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (20831), సంత్రగాచి-పూరీ ఎక్స్‌ప్రెస్ (02837) తదితర రైళ్లను రద్దు చేసినట్టు పేర్కొన్నారు.
కాగా, బెంగళూరు-గువాహటి (12509) రైలును విజయనగరం, టిట్లాగడ్, జార్సుగుడా, టాటా మీదుగా దారి మళ్లించారు. ఖరగ్‌పూర్ డివిజన్‌లో ఉన్న చెన్నై సెంట్రల్-హౌరా (12840) రైలును జరోలీ మీదుగా, వాస్కోడగామా-షాలీమార్ (18048), సికింద్రాబాద్-షాలీమార్ (22850) వీక్లీ రైళ్లను కటక్, అంగోల్ మీదుగా మళ్లించినట్టు వెల్లడించారు.
గోవా-ముంబై ‘వందేభారత్’ రైలు ప్రారంభోత్సవాన్ని కూడా వాయిదా వేశామని కొంకణ్ రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటించారు.