Akhand Bharat: పార్లమెంటులోని అఖండ భారత్ చిత్రపటంపై నేపాల్ మాజీ ప్రధానుల అసంతృప్తి.. పాకిస్థాన్ లో సైతం ఆందోళన!

Nepal Ex Prime Ministers dissatisfaction on Akhand Bharat mural

  • ఆప్ఘనిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ వరకు అఖండ భారత్
  • అశోకుడి కాలంనాటి సువిశాలమైన భారత్ పటం పార్లమెంటులో ఏర్పాటు
  • తమ నగరాలను భారత పటంలో చూపించడం సరికాదన్న నేపాల్ మాజీ ప్రధానులు

ఇటీవల పార్లమెంట్ కొత్త భవనంలో అఖండ భారత్ చిత్ర పటాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అశోకుడి పాలన అత్యున్నత స్థాయిలో ఉన్నప్పటి అఖండ భారత్ ను ఈ పటంలో చూపించారు. తద్వారా అఖండ భారత్ తమ సంకల్పమనే విషయాన్ని బీజేపీ పరోక్షంగా వెల్లడించింది. ఈ పటంలో ఆప్ఘనిస్థాన్, పాకిస్థాన్, నేపాల్ తదతర దేశాలను కూడా భారత భూభాగంగానే చూపించారు. దీనిపై నేపాల్ లో ఆందోళన వ్యక్తమవుతోంది. నేపాల్ మాజీ ప్రధానులు బాబూరామ్ భట్టారాయ్, కేపీ శర్మ ఓలీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. 

తమ దేశంలోని కపిలవస్తు, లుంబినిలను భారత భూభాగంలో చూపించడం సరికాదని నేపాల్ మాజీ ప్రధానులు అన్నారు. అశోక చక్రవర్తి కాలం నాటి భారత్ ను పటంలో చూపించారని నేపాల్ విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. 

ట్విట్టర్ ద్వారా భట్టారాయ్ స్పందిస్తూ... ఇప్పటికే భారత్ కు పొరుగు దేశాలతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, ఈ తరుణంలో ఈ చర్య ద్వైపాక్షిక సంబంధాల లోటును మరింత ఎక్కువ చేసే అవకాశాలు ఉన్నాయని అన్నారు. కేపీ ఓలి స్పందిస్తూ... భారత పార్లమెంటులో అఖండ భారత్ పటాన్ని ఏర్పాటు చేయడం ఏమాత్రం సరికాదని అన్నారు. 

ప్రస్తుతం నేపాల్ ప్రధాని పుష్పకుమార్ ధమాల్ (ప్రచండ) నాలుగు రోజుల భారత పర్యటనలో ఉన్న సమయంలో ఆ దేశ మాజీ ప్రధానులు ఈ మేరకు అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో గురువారం నాడు ప్రచండ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రచండ మాట్లాడుతూ, భారత్ తో నేపాల్ సంబంధాలను హిమాలయాల అంత ఎత్తుకు తీసుకెళ్తామని చెప్పారు. మరోవైపు అఖండ భారత్ చిత్రపటం పాకిస్థాన్ లో సైతం ఆందోళన రేకెత్తిస్తోంది. మౌర్యుల కాలం నాటి ప్రఖ్యాత తక్షశిల పాకిస్థాన్ లోనే ఉంది. ఇది ఇస్లామాబాద్ కు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది.  

అశోకుడు మౌర్య వంశ రాజులలో మూడో వాడు. సువిశాలమైన భూభాగాన్ని పాలిస్తూ చక్రవర్తిగా పేరుగాంచాడు. ఆయన సామ్రాజ్యం ఆఫ్ఘనిస్థాన్ నుంచి తూర్పున ఉన్న బంగ్లాదేశ్ వరకు విస్తరించి ఉండేది. కేరళ, తమిళనాడు, ఆధునిక శ్రీలంక మినహా భారత ఉపఖండం మొత్తం వ్యాపించి ఉండేది.
అశోకుడి కాలం నాటి సువిశాల భారత్.. (ఇమేజ్ కర్టసీ - వికీపీడియా)

  • Loading...

More Telugu News