Chiranjeevi: అభిమానులారా రంగంలోకి దిగండి.. వారి ప్రాణాలు కాపాడండి: చిరంజీవి
- కోరమండల్ రైలు ఘోర ప్రమాద ఘటనపై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి
- క్షతగాత్రులకు అవసరమైన రక్తదానం చేయాలని సమీప ప్రాంత అభిమానులకు పిలుపు
- మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన జూనియర్ ఎన్టీఆర్
ఒడిశాలో కోరమండల్ రైలు ఘోర ప్రమాద ఘటనపై మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ప్రమాదంపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే సహాయక చర్యలు అందించాలని మెగా అభిమానులకు చిరంజీవి పిలుపునిచ్చారు. ఈ సమయంలో క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు రక్తం అవసరం ఉంటుందన్నారు. కాబట్టి సమీప ప్రాంతాల్లోని అభిమానులు రక్తదానం చేసి విలువైన ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు.
‘కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటన, భారీ ప్రాణనష్టం నన్ను ఎంతగానో కలచివేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. ఈ ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు చికిత్స నిమిత్తం రక్తం అవసరం ఉంటుందని అర్థం చేసుకుంటున్నా. రక్తదానం చేసి వారి ప్రాణాలను రక్షించేందుకు సమీప ప్రాంతాల్లోని మా అభిమానులు, సేవా దృక్పథులు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.