Mamata Banerjee: 21వ శతాబ్దంలో ఇది అతిపెద్ద రైల్వే ప్రమాదం.. రాజకీయాలకు ఇది సమయం కాదు: మమతా బెనర్జీ విమర్శలు

west bengal cm sensational comments odisha train crash

  • రైల్వేలో సమన్వయ లోపం, గ్యాప్ కనిపిస్తోందన్న మమత 
  • ప్రమాదంపై కేంద్రం విచారణ జరపాలని డిమాండ్
  • భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వ్యాఖ్య

ఒడిశాలో రైలు ప్రమాదం చోటుచేసుకున్న ఘటన స్థలాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర మంత్రులు అశ్వనీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్ ను కలిశారు. తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాలకు ఇది సమయం కాదని అన్నారు. ఈ ఘటన ఎలా జరిగిందో తెలుసుకుని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.

  ‘‘అత్యుత్తమ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కోరమాండల్ ఒకటి. నేను మూడు సార్లు రైల్వే మంత్రిగా పనిచేశా. నాకు తెలిసి.. ఇది 21వ శతాబ్దంలో జరిగిన అతిపెద్ద రైల్వే ప్రమాదం. ప్రమాదంపై కేంద్రం విచారణ జరపాలి. రైల్వేలో సమన్వయ లోపం, గ్యాప్ కనిపిస్తోంది. వీళ్లకు బడ్జెట్ కూడా ఉండదు’’ అంటూ విమర్శించారు. రైల్వే బడ్జెట్‌లో నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. 

‘‘ఇలాంటి కేసులను రైల్వే సేఫ్టీ కమీషన్‌కి అప్పగిస్తారు. వారు దర్యాప్తు చేసి నివేదిక ఇస్తారు. రైలులో యాంటీ కొలిజన్ పరికరం లేదు. ఆ పరికరం రైలులో ఉండి ఉంటే.. ఈ ఘోరం జరిగేది కాదు. చనిపోయిన వారిని తిరిగి తీసుకురాలేము. కానీ రెస్క్యూ ఆపరేషన్, సాధారణ స్థితిని పునరుద్ధరించడమే మన పని’’ అని మమత చెప్పుకొచ్చారు.

రైల్వే ఫ్యామిలీలో తాను మెంబర్ ని అని మమత అన్నారు. ఒడిశా ప్రభుత్వానికి, రైల్వేకు తాము సహకరిస్తామని తెలిపారు. బెంగాల్ నుంచి అంబులెన్స్‌లు, వైద్య సిబ్బందిని ఒడిశాకు తీసుకొచ్చినట్టు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రైల్వే పరిహారంగా రూ.10 లక్షలు అందజేస్తుందని, తాము తమ రాష్ట్ర ప్రజలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఇస్తామని మమత ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున అందజేస్తామన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కూడా మమతా బెనర్జీ పరామర్శించారు.

  • Loading...

More Telugu News