Kamal Haasan: జనాభా నియంత్రణ పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తారా?: కమలహాసన్
- లోక్ సభ నియోజకర్గాల పునర్విభజన జరగబోతోందంటూ పెద్ద ఎత్తున చర్చ
- జనాభా ఆధారంగా విభజిస్తే దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గుతుందని కమల్ ఆందోళన
- యూపీ, బీహార్ కంటే దక్షిణాది రాష్ట్రాల జనాభా తక్కువని వ్యాఖ్య
జనాభా ఆధారంగా లోక్ సభ నియోజకర్గాల పునర్విభజన జరగబోతోందనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. అయితే, డీలిమిటేషన్ ను దక్షిణాది రాష్ట్రాలకు చెందిన నేతలు, రాజకీయ విశ్లేషకులు వ్యతిరేకిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. జనాభా ప్రాతిపదికన లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అంటున్నారు.
తాజాగా ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమలహాసన్ స్పందిస్తూ... జనాభా నియంత్రణ పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తారా? అని ప్రశ్నించారు. జనాభా ఆధారంగా పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు ఎన్ని స్థానాలు దక్కుతాయో అనే విషయం ఆందోళనకు గురి చేస్తోందని అన్నారు. పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందని చెప్పారు. దేశ జనాభాను నియంత్రించి దేశాభివృద్ధిలో కీలక పాత్రను పోషించిన రాష్ట్రాలను శిక్షించాలనుకోవడం ముమ్మాటికీ సరికాదని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల మొత్తం జనాభా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల కంటే తక్కువని అన్నారు.