Shubman Gill: గిల్ ను అప్పుడే సచిన్, కోహ్లీతో పోల్చడమెందుకు?: టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టన్
- కెరియర్ ప్రారంభంలో ఉన్న ఆటగాడిని సచిన్, కోహ్లీతో పోల్చడం సరికాదన్న కిర్ స్టన్
- గిల్ కు అన్ని ఫార్మాట్ల క్రికెట్ ఆడే సత్తా ఉందని వ్యాఖ్య
- సవాళ్లు, అడ్డంకులను ఎలా అధిగమిస్తాడన్నదే అతని సక్సెస్‌ను నిర్ణయిస్తుందని వెల్లడి
ఏ ఫార్మాట్ అయినా.. పరుగుల వరద పారిస్తున్నాడు యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్. మొన్నటి దాకా జరిగిన ఐపీఎల్, అంతకుముందు జరిగిన సిరీస్ లలోనూ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. దీంతో ప్రస్తుతం అతడి పేరు మారుమోగుతోంది. ప్రశంసల వర్షం కురుస్తోంది. కొందరైతే అప్పుడే అతడిని లెజండరీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలతో పోలుస్తున్నారు.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్, గుజరాత్ టైటాన్స్ మెంటార్ గ్యారీ కిర్‌స్టన్ స్పందిస్తూ.. గిల్‌ను అప్పుడే కోహ్లీ, సచిన్‌తో పోల్చడాన్ని తప్పుబట్టాడు. కెరియర్ ప్రారంభంలో ఉన్న యువ ఆటగాడిని ఆ ఇద్దరితో పోల్చడం సరికాదన్నాడు. శుభ్‌మన్ గిల్ కు అన్ని ఫార్మాట్ల క్రికెట్ ఆడే సత్తా ఉందని చెప్పాడు.
‘‘ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా ఎదగడానికి కావాల్సిన నైపుణ్యం, సంకల్పం శుభ్‌మన్ గిల్ దగ్గర ఉన్నాయి. కానీ కెరియర్ ఆరంభంలోనే అతడిని సచిన్, కోహ్లీలతో పోల్చడం సరికాదు. భారత్ తరఫున గిల్ అన్ని ఫార్మాట్లలోనూ సక్సెస్ అవుతాడని నమ్ముతున్నాను’’ అని గ్యారీ కిర్‌స్టన్ చెప్పుకొచ్చాడు.
టీ20 క్రికెట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో గిల్ లాంటి క్రికెటర్లను మనం తరచూ చూడలేమని అన్నాడు. భారత్ తరఫున అన్ని ఫార్మాట్లలో గొప్ప ప్లేయర్ అయ్యే లక్షణాలు శుభ్‌మన్ గిల్లో ఉన్నాయని, అయితే సవాళ్లు, అడ్డంకులను అతను ఎలా అధిగమిస్తాడన్నదే అతని దీర్ఘకాల సక్సెస్‌ను నిర్ణయిస్తుందని అభిప్రాయపడ్డాడు. ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలని గిల్ కు సూచించాడు.
గిల్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 2023లో 17 మ్యాచ్‌లు ఆడి 890 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ నెల 7న ప్రతిష్ఠాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్ పోరు జరగనుంది. ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ లో గిల్ ఇదే జోరు కొనసాగించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. రోహిత్ శర్మతో కలిసి గిల్ ఓపెనింగ్ కు వచ్చే అవకాశం ఉంది.