Train Accident: ఒడిశా రైలు ప్రమాద ఘటనపై పాక్ సహా ప్రపంచ దేశాధినేతల దిగ్భ్రాంతి
- రైలు ప్రమాదంలో అంతమంది ప్రాణాలు కోల్పోవడంపై జపాన్ ప్రధాని విచారం
- బాధను పంచుకుంటామన్న రష్యా అధ్యక్షుడు
- క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని పాక్ ప్రధాని ప్రార్థన
ఒడిశా భారీ రైలు ప్రమాదంపై ప్రపంచ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అదే సమయంలో భారత్ కు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, జపాన్ ప్రధాని పుమియో కిషిదా, కెనడా ప్రధాని ట్రూడో, నేపాల్ ప్రధాని పుష్పకమల్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తదితరులు ఈ ప్రమాదం పట్ల సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటనలో అనేకమంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, జపాన్ తరఫున తాను సంతాపం తెలుపుతున్నానని జపాన్ ప్రధాని పేర్కొన్నారు.
రైలు ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయిన వారి బాధను తాము పంచుకుంటామని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని రష్యా అధ్యక్షుడు అన్నారు.
రైలు ప్రమాద దృశ్యాలు కలవరపరిచాయని, క్లిష్ట పరిస్థితుల్లో భారత్ కు అండగా ఉంటామన్నారు కెనడా ప్రధాని.
రైలు ప్రమాద ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నానని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని పాక్ ప్రధాని అన్నారు. వివిధ దేశాల అధినేతలు కూడా ఈ ప్రమాదం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.