Andhra Pradesh: ఏపీని అల్లాడిస్తున్న భానుడు.. నేడు, రేపు కూడా భగభగలే!
- 46 డిగ్రీల వరకు నమోదవుతున్న ఉష్ణోగ్రతలు
- నేడు 135, రేపు 276 మండలాల్లో వడగాల్పులు
- రావిపాడులో అత్యధికంగా నిన్న 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
ఆంధ్రప్రదేశ్‌లో భానుడు మళ్లీ చెలరేగిపోతున్నాడు. ఉదయం 9 గంటల నుంచే నిప్పులు చెరుగుతున్నాడు. ఫలితంగా 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నేడు, రేపు కూడా ఉష్ణోగ్రతలు ఇలానే ఉంటాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నేడు 135, రేపు 276 మండలాల్లో వడగాల్పులు, తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.
పల్నాడు జిల్లా రావిపాడులో నిన్న అత్యధికంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, గుంటూరు జిల్లా మంగళగిరి, తూర్పుగోదావరి జిల్లా పెరవలి, బాపట్ల జిల్లా వేమూరు, మన్యం జిల్లా పెదమేరంగిలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 14 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 143 మండలాల్లో వడగాల్పులు వీచినట్టు వివరించారు.
ఇక, నేడు విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో నేడు 44 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.