Pawan Kalyan: తెనాలి నుంచి బరిలోకి దిగుతున్నా.. నాదెండ్ల మనోహర్
- సీట్ల సర్దుబాటుపై పవన్, చంద్రబాబు మాట్లాడుకుంటారన్న మనోహర్
- రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వైసీపీని ఓడించాల్సిందేనన్న జనసేన నేత
- ఈ నెల 14 నుంచి పవన్ వారాహి యాత్ర మొదలు
వచ్చే ఎన్నికల్లో టీడీపీతో సీట్ల సర్దుబాటుపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన చీఫ్ పవన్ మాట్లాడుకుంటారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. నిన్న తెనాలిలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. తాను మాత్రం తెనాలి నుంచే పోటీకి దిగుతానని స్పష్టం చేశారు. రాష్ట్రం అభివృద్ధి కావాలంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడం తప్ప మరో మార్గం లేదన్నారు.
దారుణాలకు పాల్పడుతున్న ప్రభుత్వానికి సరైన సమాధానం చెప్పే రోజు వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రం కోసం భూములిచ్చిన రైతులను, వారి త్యాగాలను ప్రభుత్వం అవమానిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 14 నుంచి పవన్ కల్యాణ్ వారాహి యాత్ర మొదలవుతుందని తెలిపారు. అన్నవరం క్షేత్రంలో పూజల అనంతరం యాత్ర ప్రారంభమవుతుందని వివరించారు.
ఈ యాత్రకు, పొత్తులకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. పవన్ తొలి విడత యాత్రలో తూర్పుగోదావరి, ప్రత్తిపాడు, కాకినాడ రూరల్, పిఠాపురం, రాజోలు, ముమ్మిడివరం, పి.గన్నవరం నుంచి నర్సాపురం వరకు పర్యటిస్తారని మనోహర్ వివరించారు. తూర్పు గోదావరి జిల్లాలో యాత్ర షెడ్యూల్ ఖరారైందని, పది నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగుతుందని తెలిపారు.