Maharashtra: అంబేద్కర్ జయంతి సెలబ్రేట్ చేసుకున్నందుకు.. దళితుడిని చంపేశారు!
- మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఘటన
- కత్తులతో పొడిచి చంపిన నిందితులు
- ఏడుగురు నిందితుల అరెస్ట్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి నిర్వహించిన దళితుడు హత్యకు గురయ్యాడు. మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని బోందర్ హవేలి గ్రామంలో రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడిని అక్షయ్ భలేరావ్‌గా గుర్తించారు. గురువారం సాయంత్రం అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి వివాహం జరుగుతుండగా, అదే సమయంలో సోదరుడు ఆకాశ్‌తో కలిసి భలేరావ్ అటుగా వెళ్తున్నాడు.
చేతిలో కత్తులు ధరించిన నిందితులు వారిని చూసి.. భీం జయంతి (అంబేద్కర్ జయంతి)ని జరుపుకున్న వీరిని చంపేయాలంటూ దూసుకొచ్చారు. ఈ క్రమంలో వారి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. దీంతో మరింత రెచ్చిపోయిన నిందితులు భలేరావ్‌పై దాడిచేసి కత్తులతో విచక్షణ రహితంగా పొడిచినట్టు పోలీసులు తెలిపారు. ఆకాశ్‌ను కూడా చితకబాదారు. నిందితుల దాడిలో తీవ్రంగా గాయపడిన అక్షయ్ భలేరావ్‌ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతడు మృతి చెందినట్టు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు.