Balasore: ఒడిశా రైలు ప్రమాదం: ఎలా ఉన్నారో.. అసలు ఉన్నారో లేదో!
- వంద మందికి పైగా ప్రయాణికుల జాడ లేదు
- ఫోన్లు స్విచ్ఛాఫ్.. ఆందోళనలో కుటుంబ సభ్యులు
- బాలాసోర్ ఆసుపత్రిలో తమ వారి కోసం వెతుకులాట
ఒడిశా రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు 288 మంది ప్రాణాలు కోల్పోగా మరో 1175 మంది గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో 793 మందిని వైద్యులు డిశ్చార్జ్ చేసి పంపించినట్లు సమాచారం. అయితే, కోరమండల్ ఎక్స్ ప్రెస్, హౌరా ఎక్స్ ప్రెస్ రైళ్లలో ప్రయాణించిన పలువురి ఆచూకీ ఇప్పటికీ దొరకడంలేదు. వందకు పైగా ప్రయాణికులు ఏమైపోయారో తెలియడంలేదు. ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారిలో కానీ ఇప్పటి వరకు బయటపడ్డ మృతదేహాలలో కానీ వారు లేరు. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వస్తోందని, వారు ఎక్కడ ఉన్నారో తెలియడంలేదని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. హెల్ప్ లైన్ కేంద్రాలకు ఫోన్ చేసి ఆరాతీసినా ఉపయోగంలేకుండా పోయిందని చెప్పారు.
బాధితుల కుటుంబ సభ్యులలో కొంతమంది బాలాసోర్, కటక్ ఆసుపత్రులకు చేరుకుని తమ వారి ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. గాయపడిన వారిలో తమ వారు ఉండాలని ప్రార్థిస్తూ వెతుకుతున్నారు. అయితే, ఇటు ఆసుపత్రిలో కానీ అటు మార్చురీలలోని డెడ్ బాడీలలో కానీ వారి ఆచూకీ దొరకలేదని వాపోయారు. ఎక్కడ ఉన్నారో.. అసలు ఉన్నారో లేదోనని కన్నీటి పర్యంతం అవుతున్నారు. కనిపించిన ప్రతీ అధికారినీ ఆరా తీస్తున్నారు. మరోవైపు, రిజర్వేషన్ బోగీలలో ప్రయాణికులకు సంబంధించి కొంత స్పష్టత ఉన్నా.. జనరల్ బోగీలో ప్రయాణించిన వారి వివరాలు తెలుసుకోవడం మరింత కష్టంగా మారింది.