Rajasthan: కోపంతో మైక్‌ను నేలకేసి కొట్టిన రాజస్థాన్ ముఖ్యమంత్రి
- బహిరంగ వేదికపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అసహనం
- మైక్ పని చేయకపోవడంతో విసిరికొట్టిన సీఎం
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అగ్రనేత నేత అశోక్ గెహ్లాట్ బహిరంగ వేదికపై తీవ్ర అసహనానికి గురయ్యారు. ఓ కార్యక్రమంలో మైక్ సక్రమంగా పని చేయకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. మైక్‌ను నేలకేసి కొట్టారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. మహిళల కోసం రాజస్థాన్ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలపై సమీక్షించేందుకు సీఎం గెహ్లాట్ బర్మర్ జిల్లాలో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పథకాల అమలు తీరును సమావేశానికి హాజరైన మహిళలను అడిగేందుకు గెహ్లాట్ మైక్ అందుకున్నారు. కానీ, ఆ మైక్ పని చేయలేదు.
దీంతో ఆయనకు తీవ్ర అసహనం కలిగింది. తనకు ఎడమవైపున పక్కనే ఉన్న బర్మర్ జిల్లా కలెక్టర్ ను ‘ఏంటిది’ అన్నట్టుగా చూస్తూ ఆ మైక్‌ను విసిరేశారు. ముందున్న ఓ మహిళ ఇంకో మైక్‌ను గెహ్లాట్‌కు ఇచ్చారు. అయితే, సీఎం గెహ్లాట్ మైక్‌ను జిల్లా కలెక్టర్‌పైకి విసిరికొట్టారని జరిగిన ప్రచారాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం ఖండించింది. కాగా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొందరు వ్యక్తులు వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పడంతో గెహ్లాట్ మరోసారి అసహనం ప్రదర్శించారు.