Old Man: రైలు ప్రమాదంలో వృద్ధుడు వెదుకుతున్న కొడుకు దొరికాడు... కానీ!

Old man found son dead body in Odisha train accident

  • ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం
  • 288 మంది మృతి
  • తమ వాళ్లు కానరాక కుటుంబ సభ్యులు, బంధువుల వేదన
  • కొడుకు ఆచూకీ కోసం 24 గంటలు వెదికిన వృద్ధ తండ్రి

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో వందల సంఖ్యలో మృతి చెందారు. పట్టాలు తప్పిన రైలు బోగీల్లో  కొన్ని మృతదేహాలు ఛిద్రమైన స్థితిలో దర్శనమిచ్చాయి. ఏ అవయవం ఎవరిదో తెలియని దారుణ పరిస్థితి నెలకొంది. 

ఆ రోజున కోరమాండల్ ఎక్స్ ప్రెస్, బెంగళూరు-హౌరా ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించిన తమ వాళ్లు కానరాక అయినవాళ్ల వేదన వర్ణనాతీతం. కాగా, ఓ వృద్ధుడు తన కుమారుడి కోసం వెదికిన తీరు అందరినీ కలచివేసింది. క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆసుపత్రులన్నీ తిరిగిన ఆ వృద్ధుడు... ప్రతి ఆసుపత్రిలో ఉన్న మార్చురీలోనూ కుమారుడి కోసం అన్వేషించాడు. 

మార్చురీలో ఒక్కో శవంపై ఉన్న ముసుగును తొలగించి చూసే క్షణాల్లో ఆ వృద్ధుడి గుండె కొట్టుకున్న తీరు ఓ తండ్రి మనసుకు నిదర్శనంగా నిలిచింది.

కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో కొడుకు వస్తుండడంతో అతడి కోసం ఎదురుచూస్తున్న ఆ వృద్ధ తండ్రిని రైలు ప్రమాద ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. వెంటనే ప్రమాద ఘటన స్థలానికి వెళ్లిన ఆ వృద్ధుడు గాయపడ్డవారిని తరలించిన ఆసుపత్రులన్నీ తిరిగాడు. 

గంట రెండు గంటలు కాదు... ఏకంగా 24 గంటల పాటు కొడుకు కోసం వెదుకుతూనే ఉన్నాడు. ఓ స్కూల్లో కొన్ని మృతదేహాలు  ఉన్నాయంటే అక్కడికీ వెళ్లాడు. ప్రతి ముసుగు తీయడం... నా బిడ్డ కాదు అని కొద్దిగా ఊరట పొందడం... ఇలా సాగింది అతడి అన్వేషణ! 

అయితే, విషాదకర రీతిలో కొడుకు మృతదేహం ఆ తండ్రి కంటబడింది. దాంతో ఆ పెద్దాయన గుండె పగిలినంత పనైంది. కనీసం గాయాలతో ఉన్నా ఫర్వాలేదు అని భావించిన ఆ వృద్ధుడు.. ఏదైతే జరగకూడదని భావించాడో అదే జరగడంతో భోరున విలపించాడు. చివరికి బరువెక్కిన గుండెతో కొడుకు మృతదేహాన్ని తీసుకుని అక్కడ్నించి తరలిపోయాడు.

  • Loading...

More Telugu News