Karnataka: గోవధలో తప్పేముంది?.. కర్ణాటక మంత్రి
- గేదెలు, ఎద్దులు విషయంలో లేని తప్పు గోవుకెలా వర్తిస్తుందన్న మంత్రి
- గత ప్రభుత్వం తీసుకొచ్చిన గోహత్య నిరోధక బిల్లు అమలు చేసే యోచనలో కాంగ్రెస్
- తన వ్యాఖ్యలతో కలకలం రేపిన మంత్రి వెంకటేశ్
కర్ణాటక పశుసంక్షేమ, వెటర్నరీ సైన్స్ శాఖామంత్రి కె. వెంకటేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వయసు మళ్లిన పశువుల పోషణ రైతులకు కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఎద్దులు, గేదెలను వధిస్తున్నప్పుడు గోవుల విషయంలో అది తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. కర్ణాటకలోని గత బీజేపీ ప్రభుత్వం 2021లో తీసుకొచ్చిన గోహత్య నిరోధక, పశువుల సంరక్షణ (సవరణ) బిల్లు అమలు విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం లోతుగా పరిశీలిస్తున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు కలకలం రేపాయి.
బిల్లులో ఏముంది?
బీజేపీ తీసుకొచ్చిన ఈ బిల్లులో గోవుల అక్రమ రవాణా, గోవధ, వాటిని హింసించడం వంటి వాటిని నిషేధించింది. ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే 3 నుంచి ఏడేళ్ల జైలుశిక్ష, రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. పదేపదే అలాంటి చర్యలకు పాల్పడితే ఏడేళ్ల జైలుశిక్ష, లక్ష నుంచి రూ. 10 లక్షల జరిమానా విధిస్తారు.
13 ఏళ్ల లోపున్న పశువులను గేదెలుగా పరిగణిస్తారు. అన్ని వయసుల ఎద్దులు, ఆవులు, ఆవు దూడలు, గొడ్డుమాంసం దేనినైనా పశువుల మాంసంగా బిల్లులో పేర్కొన్నారు. డిసెంబరు 2020లో అప్పటి బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపినప్పుడు కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేస్తూ విధాన సభ నుంచి వాకౌట్ చేసింది.