Hyderabad: మొబైల్ ఫోన్ పోయిందని హైదరాబాద్ లో యువకుడి ఆత్మహత్య
- రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డ బోరబండ యువకుడు
- తొలుత ఓ ఫోన్ పోవడంతో ఈఎంఐలో మరో ఫోన్ కొనిచ్చిన తండ్రి
- రెండోసారి కొనిచ్చిన ఫోన్ కూడా పోవడంతో అఘాయిత్యం
డెలివరీ బాయ్ గా పనిచేస్తూ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్న ఓ యువకుడు సోమవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఫోన్ పోవడంతో తండ్రి ఈఎంఐలో మరో ఫోన్ కొనివ్వగా.. అది కూడా పోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. సోదరుడికి ఫోన్ చేసి అమ్మానాన్నను బాగా చూసుకోవాలని చెప్పి వెళ్లి రైలు కింద పడ్డాడు. హైదరాబాద్ లోని బోరబండలో జరిగిన ఈ విషాద సంఘటన వివరాలు..
బోరబండలోని రాజనగర్ లో ఉంటున్న చుక్కా శ్రీనివాస్ నిమ్స్ దవాఖానలో వార్డుబాయ్ గా పనిచేస్తున్నాడు. శ్రీనివాస్ రెండో కుమారుడు చుక్కా సాయికుమార్ బిగ్ బాస్కెట్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో నెల రోజుల కిందట కృష్ణకాంత్ పార్క్ కు వెళ్లిన సమయంలో సాయి కుమార్ ఫోన్ పోగొట్టుకున్నాడు. తన ఉద్యోగానికి ఫోన్ తప్పనిసరి కావడంతో తండ్రికి చెప్పగా.. ఈఎంఐ విధానంలో రూ.28 వేల విలువైన మరో ఫోన్ ను శ్రీనివాస్ కొనిచ్చాడు. అయితే, ఇటీవల ఈ ఫోన్ ను కూడా సాయికుమార్ పోగొట్టుకున్నాడు.
దీనిపై బోరబండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా.. ఈ-సేవా కేంద్రంలో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. దీంతో స్నేహితులతో కలిసి వెళ్లి ఈ-సేవలో ఫిర్యాదు చేశాడు. ఆపై సాయి కుమార్ ఎటువెళ్లిందీ ఎవరికీ తెలియదు. ఈ నేపథ్యంలోనే సాయికుమార్ తండ్రి శ్రీనివాస్ కు రైల్వే పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. తుకారాంగేట్ వద్ద రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు, వచ్చి గుర్తించాలని చెప్పారు. దీంతో హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి చేరుకున్న శ్రీనివాస్.. రెండు ముక్కలైన సాయికుమార్ శరీరాన్ని చూసి భోరుమన్నాడు. శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.