Ad spend: ఐపీఎల్ సమయంలో ప్రకటనల ద్వారా రూ.4,000 కోట్లు
- గతేడాదితో పోలిస్తే 20 శాతం తగ్గుదల
- టీవీ ప్రసారాలకు తగ్గిపోయిన వీక్షకులు
- జియో సినిమా ఉచితంగా వీక్షించే అవకాశంతో ప్రతికూల ప్రభావం
ఐపీఎల్ సీజన్ 2023లో ప్రకటనల రూపంలో భారీ ఆదాయం సమకూరింది. అయినా కానీ, వచ్చిన ఆదాయం అంచనాల కంటే తక్కువగానే ఉంది. ఈ సీజన్ లో సుమారు రూ.4,000 కోట్ల వరకు వచ్చి ఉంటుందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. కానీ, గతేడాది ఈ ఆదాయం రూ.5,000 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. దీనిపై వయాకామ్ 18 స్పోర్ట్స్ సీఈవో అనిల్ జయరాజ్ మీడియాతో మాట్లాడారు.
ఐపీఎల్ ప్రకటనలపై వెచ్చించే మొత్తం గత సీజన్ తో పోలిస్తే 20 శాతం తగ్గిందని జయరాజ్ చెప్పారు. ఐపీఎల్ టీవీ వీక్షకుల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల ఉందన్నారు. ఇది ప్రకటనల ఆదాయంపై ప్రభావం చూపించినట్టు చెప్పారు. డిజిటల్ తో పోలిస్తే టీవీ ప్రకటనలపైనే ఎక్కువ ప్రభావం ఉన్నట్టు తెలిపారు. డిజిటల్ వేదికలపై ప్రకటనల రేట్లు తక్కువగా ఉన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు.
ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను ఐదేళ్ల కాలానికి వయాకామ్ రూ.23,757 కోట్లకు కొనుగోలు చేయడం గమనార్హం. టీవీ ప్రసార హక్కులను డిస్నీ స్టార్ రూ.23,578 కోట్లకు కొనుగోలు చేసింది. 2023 సీజన్ సమయంలో ప్రకటనల రూపంలో రూ.3,700 కోట్లు సమీకరించుకోవాలన్న లక్ష్యం పెట్టుకోగా, దాన్ని చేరుకున్నట్టు వయాకామ్ 18 ప్రకటించింది. 55 కోట్ల మంది వీక్షకుల మార్క్ ను చేరుకున్నట్టు తెలిపింది. గత సీజన్ వరకు టీవీ వాటా అధికంగా ఉంటే, ఈ ఏడాది ఐపీఎల్ కు పరిస్థితి పూర్తిగా మారిపోయినట్టు జయరాజ్ చెప్పారు. జియో సినిమా (వయాకామ్ 18లో భాగం) ఐపీఎల్ లైవ్ ను ఉచితంగా అందించడం తెలిసిందే. దీంతో టీవీల్లో మ్యాచులను చూసే వారి సంఖ్య పడిపోయింది.