tennis: ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్ రికార్డు బ్రేక్ చేసిన జకోవిచ్
- 17వ సారి క్వార్టర్ ఫైనల్ చేరిన సెర్బియా లెజెండ్ నొవాక్
- 16 సార్లు క్వార్టర్స్ ఆడిన నాదల్
- గాయం కారణంగా ఈ సారి ఆటకు దూరంగా ఉన్న స్పెయిన్ స్టార్
ఎర్రమట్టి కోటలో జరిగే టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఫ్రెంచ్ ఓపెన్‌లో సెర్బియా టెన్నిస్ లెజెండ్, మాజీ నంబర్‌వన్ నొవాక్ జకోవిచ్ రికార్డు సృష్టించాడు. 17వ సారి ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. దీంతో స్పెయిన్ స్టార్ రఫెల్ నాదల్ 16సార్లు క్వార్టర్ ఫైనల్స్ చేరిన రికార్డును జొకో బ్రేక్ చేశాడు. నిన్న రాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో మూడోసీడ్ జకోవిచ్ 6–3, 6–2, 6–2తో పెరూ ఆటగాడు యువాన్ పాబ్లో (పెరూ)పై గెలిచాడు. దాంతో, క్వార్టర్ ఫైనల్ చేరి పురుషుల సింగిల్స్ లో అత్యధికంగా 23 గ్రాండ్ స్లామ్స్ అందుకునేందుకు మరింత చేరువయ్యాడు.
ప్రస్తుతం నొవాక్, నాదల్ చెరో 22 గ్రాండ్‌స్లామ్స్‌తో సమంగా ఉన్నారు. గాయం కారణంగా నాదల్ ఈ టోర్నీకి దూరంగా ఉన్నాడు. 2016, 2021లో రెండుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ లో విజేతగా నిలిచిన నొవాక్ జకోవిచ్ ఈసారి కూడా టైటిల్ నెగ్గితే నాలుగు గ్రాండ్ స్లామ్ (ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్) ట్రోఫీలను కనీసం మూడేసిసార్లు గెలిచిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. కాగా, ప్రపంచ నంబర్‌వన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) కూడా క్వార్టర్ ఫైనల్ చేరాడు. ప్రిక్వార్టర్స్ లో 6–3, 6–2, 6–2తో ఇటలీ ప్లేయర్ లోరెంజో ముసెట్టిపై గెలిచాడు.