gufi paintal: టీవీ ‘శకుని మామ’ ఇకలేరు.. అనారోగ్యంతో కన్నుమూసిన గుఫీ పైంటల్
- హిందీ మహాభారతంలో శకునిగా పాప్యులరైన గుఫీ పైంటల్
- ఆరోగ్యం క్షీణించడంతో మే 31న ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు
- ఈ రోజు ఉదయం నిద్రలోనే తుది శ్వాస
ప్రముఖ హిందీ టీవీ సీరియల్ మహాభారతంలో శకుని మామగా నటించిన గుఫీ పైంటల్ (79) ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. పరిస్థితి విషమించి ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు. ‘‘దురదృష్టవశాత్తు గుఫీ పైంటల్ ఇక లేరు. ఉదయం 9 గంటల సమయంలో నిద్రలోనే ఆయన కన్నుమూశారు’’ అని గుఫీ బంధువు హీటెన్ పైంటల్ చెప్పారు.
గుఫీ పైంటల్ చాలా కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. పరిస్థితి క్షీణించడంతో మే 31న కుటుంబసభ్యులు ముంబైలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం మెరుగైందని వార్తలు వినిపించాయి. అయితే అకస్మాత్తుగా పరిస్థితి విషమించి మరణించారు. ఈ రోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
సుహాగ్, దిల్లాగీ తదితర సినిమాలతోపాటు సీఐడీ, హెల్లో ఇన్ స్పెక్టర్ వంటి టీవీ షోల్లో నటించారు. తన నటనతో అందరినీ ఆకట్టుకున్నా.. మహాభారతంలోని శకుని మామ పాత్ర ద్వారా చాలా పాప్యులర్ అయ్యారు. నటుడిగానే కాదు దర్శకుడిగానూ గుఫీ పని చేశారు. కొన్ని టీవీ షోలతోపాటు ‘శ్రీ చైతన్య మహాప్రభు’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. అసోసియేట్ డైరెక్టర్, కాస్టింగ్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్‌గానూ చేశారు.