Odisha: ఒడిశా రైలు ప్రమాదం: కొడుకును శవాగారంలో సజీవంగా గుర్తించిన తండ్రి

Odisha train accident Father found son alive  in a morgue

  • కొడుకును కోరమాండల్ ఎక్కించిన కాసేపటికే ప్రమాదం
  • తనయుడి కోసం కోల్ కతా నుండి అంబులెన్స్ లో వచ్చిన తండ్రి
  • శవాగారంలో చేయి కదులుతుండగా గుర్తించి, ఆసుపత్రికి తరలింపు

ఒడిశాలోని బాలాసోర్ లో మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 275 మంది వరకు మృత్యువాతపడ్డారు. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంలో తన కొడుకు చనిపోయి ఉండవచ్చునంటే ఓ తండ్రి ఎంతమాత్రమూ నమ్మలేదు. చివరకు అతని నమ్మకమే నిజమైంది! శవాగారంలో సజీవంగా ఉన్న తన కొడుకును వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించాడు. తమ కొడుకు కోసం అంబులెన్స్ లో 230 కిలో మీటర్లు ప్రయాణించి, బాలాసోర్ చేరుకున్నాడు. తనయుడిని శవాగారంలో గుర్తించాడు. అతనిని ఆసుపత్రికి తరలించి, అటు నుండి తదుపరి చికిత్స కోసం కోల్ కతా తీసుకు వచ్చాడు.

24 ఏళ్ల బిస్వజిత్ మాలిక్ ప్రస్తుతం ఎస్ఎస్‌కేఎం ఆసుపత్రిలోని ట్రామా కేర్ యూనిట్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ రోజు మరో సర్జరీ చేసే అవకాశముంది. అతని ఆరోగ్య పరిస్థితి బాగా దెబ్బతిన్నప్పటికీ, కోలుకుంటున్నాడు.

బిస్వజిత్ మాలిక్ తండ్రి హేలారామ్ మాలిక్. హేలారామ్ హౌరాలో షాప్ కీపర్. అతను శుక్రవారం తన కొడుకు బిస్వజిత్ ను షాలిమార్ స్టేషన్ లో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కించాడు. ఆ తర్వాత కాసేపటికే ప్రమాదం వార్త తెలిసింది. వెంటనే తన కొడుకుకు ఫోన్ చేశాడు. బిస్వజిత్ సజీవంగా ఉన్నప్పటికీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, నొప్పితో బాధపడుతున్నాడు. తన కొడుకు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తండ్రి హేలారామ్ వెంటనే మరో ఆలోచన చేయకుండా లోకల్ అంబులెన్స్ డ్రైవర్ పలష్ పండిట్ కు ఫోన్ చేశాడు. అలాగే తనతో రావాలని బంధువు దీపక్ కు ఫోన్ చేశాడు. కోల్ కతా నుండి అంబులెన్స్ లో ఆ రాత్రే బాలాసోర్ బయలుదేరారు. ఆ రాత్రి 230 కిలో మీటర్లు ప్రయాణించి, వచ్చినప్పటికీ ఆసుపత్రులలో తన కొడుకు జాడ తెలియరాలేదు.

ఎక్కడా కనిపించకపోయేసరికి... తాత్కాలిక శవాగారమైన బాహానగ హైస్కూల్ కు వెళ్లారు. బిస్వజిత్ బాడీ అక్కడ ఉంటుందని తాము అనుకోలేదని, కానీ ఏ ఆసుపత్రిలోనూ దొరకక పోవడంతో అక్కడకు వెళ్లినట్లు హేలారామ్ బంధువు దీపక్ చెప్పాడు. అక్కడ బిస్వజిత్ ను గుర్తించామని, అతని కుడి చేయి కాస్త కదులుతున్నట్లుగా కనిపించిందని చెప్పాడు. అతను అన్‌కాన్సియస్ గా ఉన్నాడని, తీవ్రంగా గాయపడ్డాడని చెప్పాడు.

తాము వెంటనే అతనిని అంబులెన్స్ లో బాలాసోర్ ఆసుపత్రికి తరలించామని, అక్కడ కొన్ని ఇంజెక్షన్స్, మందులు ఇచ్చారని, ఆ తర్వాత కటక్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి రిఫర్ చేశారని చెప్పాడు. తాము బాండ్ పైన సంతకం చేసి అతనిని డిశ్చార్జ్ చేయించామని చెప్పాడు. అక్కడి నుండి కోల్ కతా ఎస్ఎస్‌కేఎం ఆసుపత్రికి అంబులెన్స్ లో తీసుకు వచ్చారు. అతనికి ఆదివారం చీలమండ ఆపరేషన్ జరిగింది. సోమవారం మరో సర్జరీ చేయనున్నట్లు డాక్టర్లు చెప్పారు. అతని కుడి చేతికి ఎక్కువగా గాయాలయ్యాయి.

సాధారణంగా రెస్క్యూ ఆపరేషన్స్ అనేవి నాన్-మెడికల్ సిబ్బంది చేబడతారు. అలాంటి సమయంలో స్పృహలో లేని వ్యక్తులను, తమ పిలుపులకు స్పందించని క్షతగాత్రులనూ చనిపోయినట్లుగా భావించే అవకాశం వుంది. అందుకే అతనిని తాత్కాలిక శవాగారానికి తరలించి ఉండవచ్చునని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News