Chandrababu: నా సోదరుడు స్వామి మీ అక్రమ అరెస్టులకు, వేధింపులకు భయపడే నేత కాదు: చంద్రబాబు
- కొండపి నియోజకవర్గంలో ఉద్రిక్తతలు
- టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి ఇంటి ముట్టడికి వైసీపీ యత్నం
- వైసీపీ ఇన్చార్జి ఇంటిని ముట్టడించేందుకు కదిలిన టీడీపీ శ్రేణులు
- బాలవీరాంజనేయస్వామిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో ఇవాళ చోటుచేసుకున్న ఉద్రిక్త ఘటనలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామిపై వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.
నాడు అసెంబ్లీలోనూ బాలవీరాంజనేయస్వామిపై దాడి చేశారని, ఇవాళ అక్రమంగా అరెస్ట్ చేశారని... ఇదంతా దళిత నాయకుడైన స్వామి గొంతు నొక్కేందుకు ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని చంద్రబాబు మండిపడ్డారు.
తమ పట్ల వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అహంకార ధోరణిని దళిత సమాజం గమనిస్తోంది... మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధం అయింది అని హెచ్చరించారు.
"నా సోదరుడు స్వామి మీ అక్రమ అరెస్టులకు, వేధింపులకు భయపడే నేత కాదు. ఎదిరించి పోరాడే నాయకుడు. పోలీసులు వైసీపీ క్రియాశీల కార్యకర్తల్లా కాకుండా చట్టబద్ధంగా వ్యవహరించాలి. వెంటనే స్వామిని విడుదల చేయాలి" అని చంద్రబాబు డిమాండ్ చేశారు.