Wrestlers: అమిత్ షాతో భేటీ తర్వాత టాప్ రెజ్లర్ల కొత్త ట్విస్ట్!
- ప్రభుత్వ విధుల్లో తిరిగి జాయిన్ అవుతామని చెప్పిన రెజ్లర్లు
- బ్రిజ్ భూషణ్ అరెస్ట్ డిమాండ్‌పై నిరసన కొనసాగుతుందని వెల్లడి
- ఎఫ్ఐఆర్ వెనక్కి తీసుకున్నట్లుగా వచ్చిన వార్తలు అవాస్తవమన్న సాక్షి, బజ్‌రంగ్
రెజ్లర్ల నిరసనలో సోమవారం కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రముఖ రెజ్లర్లు సాక్షి మాలిక్, బజ్ రంగ్ పునియా, వినేష్ ఫోఘాట్ కీలక ప్రకటన చేశారు. తాము మంగళవారం నుండి తమ ప్రభుత్వ విధుల్లో జాయిన్ అవుతామని చెప్పారు. అదే సమయంలో సాక్షి మాలిక్, బజ్ రంగ్ పునియా సోషల్ మీడియా ద్వారా తమ నిరసన కొనసాగుతుందని చెప్పడం గమనార్హం. తాము నిరసనను విరమించుకోవడం లేదని, న్యాయం కోసం తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చర్చించామని, కానీ తమ డిమాండ్ ఒకటేనని, బ్రిజ్ భూషణ్ సింగ్ ను అరెస్ట్ చేయాల్సిందే అన్నారు సాక్షి మాలిక్. అయితే రైల్వే ఓఎస్డీగా తన విధులకు హాజరవుతానని చెప్పారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదన్నారు సాక్షి. తాము వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు.
తాము నిరసనను ఉపసంహరించుకుంటున్నట్లుగా వచ్చిన వార్తలు అవాస్తవమని బజ్ రంగ్ పునియా అన్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలు ఏమాత్రం సరికాదన్నారు. అలాగే తాము ఎఫ్ఐఆర్ ను వెనక్కి తీసుకున్నట్లుగా వచ్చిన వార్తలు కూడా అవాస్తవమే అన్నారు. న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు.
డబ్ల్యుఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్ట్ చేయాలని టాప్ రెజ్లర్లు సాక్షి మాలిక్, బజ్ రంగ్ పునియా, వినేష్ ఫోఘాట్ తదితరులు నిరసన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఆదివారం అమిత్ షాతో సాక్షి, బజ్ రంగ్ పునియా భేటీ అనంతరం వీరు ఉద్యోగ విధుల్లో తిరిగి జాయిన్ కావాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్పారు. అయితే తమ నిరసన కొనసాగిస్తామని, అరెస్ట్ డిమాండ్ పై తగ్గేది లేదని కూడా చెబుతున్నారు.