Stock Market: నేటి స్టాక్ మార్కెట్ విశేషాలు
- లాభాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్ సూచీలు
- ఉదయం నుంచే కొనుగోళ్ల జోరు
- అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు
- సెన్సెక్స్ 240 పాయింట్లు, నిఫ్టీ 59 పాయింట్ల వృద్ధి
కొనుగోళ్ల జోరుతో నేడు స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. మదుపరులు వివిధ రంగాల షేర్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో సూచీలు పరుగులు తీశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 240.36 పాయింట్ల వృద్ధితో 62,787.47 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 59.70 పాయింట్ల వృద్ధితో 18,593.80 వద్ద ముగిసింది.
ఈ ఉదయం నుంచే ప్రపంచవ్యాప్త సూచీలు సానుకూలంగా కదలాడడంతో ఆ ప్రభావం భారత స్టాక్ మార్కెట్ ను కూడా ఉత్సాహపరిచింది. ఓ దశలో నిఫ్టీ సూచీ 18,650 వద్దకు చేరినా, చివరి గంటలో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో దూకుడు కాస్త తగ్గింది.
ఇవాళ్టి ట్రేడింగ్ లో మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, లార్సెన్ అండ్ టుబ్రో, గ్రాసిమ్ ఇండీస్ట్రస్ భారీ లాభాలు చవిచూడగా... దివీస్ లాబోరేటరీస్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, బీపీసీఎల్ నష్టాలు ఎదుర్కొన్నాయి.
వివిధ రంగాల వారీగా చూస్తే... ఆటోమొబైల్, కాపిటల్ గూడ్స్ సూచీలు 1 శాతం చొప్పున పెరిగాయి. అదే సమయంలో ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాల్లో అమ్మకాల ట్రెండ్ కనిపించింది.