Indian Railways: ఒడిశా రైలు ప్రమాదం: ప్రయాణికుల వివరాలతో ఆన్‌లైన్ లింక్స్ విడుదల చేసిన రైల్వే
- ఒడిశా ప్రభుత్వంతో కలిసి మూడు ఆన్ లైన్ లింక్స్ ను సిద్ధం చేసిన రైల్వేస్
- ప్రమాదంలో తమ వారి ఆచూకీని గుర్తించని వారు ఉంటే ఈ లింక్స్ ద్వారా తెలుసుకోవచ్చు
- 139 వంటి హెల్ప్ లైన్ నెంబర్లకు కూడా ఫోన్ చేయవచ్చు
ఒడిశా బాలాసోర్‌లో ట్రిపుల్ ట్రైన్ ప్రమాదంలో బాధిత కుటుంబాలను గుర్తించడంలో సహాయపడటానికి... ఇండియన్ రైల్వేస్ ఒడిశా ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని మరణించిన వారి ఫోటోలు, వివిధ ఆసుపత్రులలో చేరిన ప్రయాణికుల జాబితాలతో కూడిన మూడు ఆన్‌లైన్ లింక్‌లను సిద్ధం చేసింది.
ఒడిశాలోని బహనాగాలో జరిగిన ట్రిపుల్ ట్రైన్ ప్రమాదంలో తమవారి ఆచూకీ గురించి ఇంకా తెలియని వారు ఎవరైనా ఉంటే, వారు తమ వారిని సులభంగా గుర్తించేందుకు ఒడిశా ప్రభుత్వం సహకారంతో భారతీయ రైల్వే సులభతరం చేసే ప్రక్రియను చేపట్టినట్లు తెలిపింది.
ఈ దుర్ఘటనతో ప్రభావితమైన ప్రయాణికుల కుటుంబ సభ్యులు/బంధువులు/స్నేహితులు మరియు శ్రేయోభిలాషులు ఈ క్రింది వివరాల ద్వారా మరణించిన వారి ఫోటోలు, వివిధ ఆసుపత్రుల్లో చేరిన ప్రయాణికుల జాబితాను, గుర్తుతెలియని మృతదేహాల లింక్స్ ను ఉపయోగించి గుర్తించవచ్చునని ఓ ప్రకటనలో తెలిపింది.
మృతుల ఫోటోలను ఒడిశా ప్రభుత్వంతో కలిసి రైల్వే శాఖ ప్రత్యేక వెబ్ సైట్ లో పొందుపరిచింది. ఈ వెబ్ సైట్ ద్వారా తమ వారి ఆచూకీని ఎవరైనా తెలుసుకోవచ్చు. బహనాగ రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఫోటోల కోసం ఓ లింక్, ప్రమాదంలో గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి కోసం మరో లింక్, కటక్ లోని ఎస్‌సీబీలో చికిత్స పొందుతున్న వారి ఫోటోల కోసం మరో లింక్ ఇచ్చింది.
ప్రమాదంలో ఇంకా ఎవరి వివరాలైనా తెలియకుంటే 139 హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేయవచ్చు. అలాగే బీఎంసీ హెల్ప్ లైన్ నెంబర్ 1929కు కూడా ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ సేవలు 24X7 అందుబాటులో ఉంటాయి.