Gujarat: క్రికెట్ బంతి పట్టుకున్న దళిత బాలుడు.. మేనమామ బొటనవేలు తెగ్గోసిన నిందితులు!
- గుజరాత్లోని పటాన్ జిల్లాలో ఘటన
- బాలుడు బంతి ముట్టుకున్నందుకు కులం పేరుతో దూషణ
- పదునైన ఆయుధాలతో బాలుడి మేనమామ, అతడి సోదరుడిపై దాడి
గుజరాత్లో దళితులపై అమానవీయ ఘటనలు కొనసాగుతున్నాయి. మంచి దుస్తులు ధరించి గాగుల్స్ పెట్టుకున్నందుకు ఇటీవల ఓ దళితుడిని అగ్రవర్ణాల వారు చావబాదారు. ఈ ఘటన జరిగి వారం రోజులైనా కాకముందే అలాంటిదే మరోటి జరిగింది. దళిత బాలుడు క్రికెట్ బంతి ముట్టుకున్నందుకు అతడి మేనమామి బొటన వేలిని తెగ్గోశారు. పటాన్ జిల్లాలో ఆదివారం జరిగిందీ ఘటన.
పోలీసుల కథనం ప్రకారం.. కాకోషి గ్రామంలోని స్కూల్ మైదానంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా కొందరు దానిని వీక్షిస్తున్నారు. ఈ క్రమంలో తన వద్దకు వచ్చిన బంతిని ఓ బాలుడు పట్టుకున్నాడు. అది చూసిన నిందితులు బాలుడిపై కోపంతో రగిలిపోయి కులం పేరుతో దూషించారు. దీంతో అక్కడే ఉన్న బాలుడి మేనమామ ధీరజ్ పర్మార్ జోక్యం చేసుకోవడంతో వివాదం అప్పటికి సద్దుమణిగింది.
సాయంత్రం ఏడుగురు వ్యక్తులు పదునైన ఆయుధాలతో వచ్చి ధీరజ్, ఆయన సోదరుడు కిరిటీపై దాడిచేశారు. నిందితుల్లో ఒకడు కిరీటి బొటన వేలిని తెగ్గోశాడు. ఈ ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.