Delhi Police: రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. బ్రిజ్‌భూషణ్ ఇంటికి చేరుకున్న పోలీసులు
- బ్రిజ్‌భూషణ్‌పై రెండు ఎఫ్ఐఆర్‌ల నమోదు
- ఇప్పటి వరకు 137 మంది వాంగ్మూలాలు సేకరించిన సిట్
- బ్రిజ్‌భూషణ్ మద్దుతుదారులను ప్రశ్నించిన పోలీసులు
రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్ ఇంటికి ఢిల్లీ పోలీసులు చేరుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న 12 మంది వాంగ్మాలాలు నమోదు చేసుకునేందుకు ఉత్తరప్రదేశ్ గోండాలోని బ్రిజ్‌భూషణ్ ఇంటికొచ్చారు. సాక్ష్యాధారాల కోసం వాంగ్మూలం ఇచ్చిన వారి పేర్లు, చిరునామా, గుర్తింపు కార్డులను సేకరించారు. అలాగే, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ మద్దతుదారుల్లో పలువురిని ప్రశ్నించారు. ఈ కేసులో ‘సిట్’ ఇప్పటి వరకు 137 మంది వాంగ్మూలాలను నమోదు చేసింది. అయితే, సింగ్‌ను కూడా పోలీసులు విచారించారా? లేదా? అన్న విషయం తెలియరాలేదు.
అంతకుముందు ఏప్రిల్ 28న కన్నాట్ ప్లేస్ పోలీసులు బ్రిజ్‌భూషణ్‌పై రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. అందులో ఒకటి బాధిత బాలిక తండ్రి ఇచ్చినది. దీనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. సింగ్ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపడేస్తున్నారు. తనపై వస్తున్న ఆరోపణలు నిజమని తేలితే ఉరేసుకుంటానని చాలెంజ్ చేశారు.