APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలో 'ఎల్లో జర్నలిజంపై పోరాటం' అనే ప్రశ్న.. వెల్లువెత్తుతున్న విమర్శలు
- నిన్న ఏపీలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష
- ఇప్పటికే ఎల్లో జర్నలిజం అంటూ విమర్శలు గుప్పిస్తున్న సీఎం, మంత్రులు
- ఇదే అంశంపై మెయిన్స్ పరీక్షలో ప్రశ్న రావడం చర్చనీయాంశంగా మారిన వైనం
నిన్న జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలో ఎల్లో జర్నలిజంపై ప్రశ్న ఇచ్చారు. 'ఎల్లో జర్నలిజంపై పోరాటం' అనే ప్రశ్నను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చింది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి సహా, మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పదేపదే ఎల్లో జర్నలిజం అంటూ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో, ఇదే అంశంపై గ్రూప్ 1 పరీక్షలో ప్రశ్న రావడం చర్చనీయాంశంగా మారింది. 'ప్రజాస్వామ్యం - సోషల్ మీడియా పాత్ర' అనే ప్రశ్నను కూడా ఇచ్చారు. 20 మార్కుల ప్రశ్నల విభాగంలో ఈ రెండు ప్రశ్నలు వచ్చాయి. ఐదు ప్రశ్నలను ఇచ్చి, వీటిలో ఒక ప్రశ్నకు సమాధానం రాయాలని కోరారు.
మరోవైపు గత వారం జరిగిన తెలుగు పరీక్షలో కూడా 'సమాజం మీద సోషల్ మీడియా ప్రభావం' అనే ప్రశ్నను ఇచ్చారు. ఇంగ్లీష్ పరీక్షలో సైతం ఇదే ప్రశ్నను రిపీట్ చేశారు. తెలుగు పరీక్షలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన 'నాడు - నేడు' నిర్మాణాల గురించి కూడా ప్రశ్న వచ్చింది.