Coromandel Express: రైలు ప్రమాదంలో ఎలక్ట్రిక్ షాక్ మరణాలూ ఉన్నాయా?
- 40 మృతదేహాలపై కనిపించని గాయాల ఆనవాళ్లు
- ప్రమాద సమయంలో రైలు బోగీలను ఎలక్ట్రిక్ వైర్లు తాకి ఉండొచ్చన్న సందేహం
- రైల్వే పోలీసుల ఎఫ్ఐఆర్ లో వివరాల నమోదు
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అధికంగా ఉండడం వెనుక మరో అంశం వెలుగులోకి వచ్చింది. సుమారు 40 మంది ఎలక్ట్రిక్ షాక్ కారణంగా మరణించి ఉంటారని భావిస్తున్నారు. దెబ్బతిన్న బోగీల నుంచి బయటకు తీసిన 40 మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవని గుర్తించారు. రైలు పై భాగంలో ఉండే (విద్యుత్ సరఫరా లైన్లు) ఎలక్ట్రిక్ కేబుల్స్ తెగి పడడం వల్ల షాక్ కు దారితీసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ విషయాలను సహాయక చర్యల్లో పాల్గొన్న ఓ పోలీసు అధికారి వెల్లడించారు.
ఈ వివరాలను ప్రభుత్వ రైల్వే పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లోనూ పేర్కొన్నారు. ‘‘పలు మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా మారిపోయాయి. 40 మృతదేహాలపై మాత్రం ఎలాంటి గాయాలు లేవు. రక్తస్రావం ఆనవాళ్లు కూడా కనిపించలేదు. వీరు ఎలక్ట్రిక్ షాక్ కారణంగా మరణించి ఉండొచ్చు’’ అని పోలీసు అధికారి వివరించారు. రైలు పై భాగంలో వెళ్లే వైర్లు బోగీలకు తగిలినప్పుడు షాక్ చోటు చేసుకుని ఉండొచ్చని ఈస్ట్ కోస్ట్ రైల్వే మాజీ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ పూర్ణ చంద్రమిశ్రా సైతం అభిప్రాయపడ్డారు. గత శుక్రవారం జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 278 మరణించడం గమనార్హం.