Sailaja Kiran: రామోజీరావు కోడలు శైలజా కిరణ్ ను విచారిస్తున్న ఏపీ సీఐడీ అధికారులు
- మార్గదర్శి కేసులో శైలజా కిరణ్ ను ప్రశ్నిస్తున్న ఏపీ సీఐడీ
- జూబ్లీహిల్స్ లోని నివాసంలో కొనసాగుతున్న విచారణ
- ఇప్పటికే మార్గదర్శికి చెందిన రూ. 793 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిన సీఐడీ
మార్గదర్శి చిట్ ఫండ్స్ లో అవకతవకలు జరిగాయనే అభియోగాలతో ఏపీ సీఐడీ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వారు ఈనాడు సంస్థల అధినేత రామోజీరావును ప్రశ్నించారు. మార్గదర్శికి చెందిన రూ. 793.50 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు. మరోవైపు రామోజీరావు కోడలు, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ ను సీఐడీ అధికారులు ఈ రోజు ప్రశ్నిస్తున్నారు. జూబ్లీహిల్స్ లోని రామోజీరావు నివాసానికి వెళ్లిన అధికారులు అక్కడే ఆమెను విచారిస్తున్నారు. మార్గదర్శి చందాదారుల నగదును ఎక్కడికి తరలించారనే కోణంలో ఆమెను ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. రామోజీ గ్రూపుకు చెందిన ఇతర కంపెనీలకు నిధులను తరలించినట్టు సీఐడీ అధికారులు చెపుతున్న సంగతి తెలిసిందే.