Samsung: రంగులు మార్చే డిజైన్ తో శామ్ సంగ్ ఎఫ్54 5జీ విడుదల
- దీని ధర రూ.27,999 నుంచి ప్రారంభం
- అమోలెడ్ డిస్ ప్లే, 120 హెర్జ్ రీఫ్రెష్ రేటు
- నాలుగేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్ డేట్స్
శామ్ సంగ్ గెలాక్సీ ఎఫ్ 54 5జీ ఫోన్ విడుదలైంది. దీని ధర రూ.27,999 నుంచి మొదలవుతుంది. ఇందులో బ్యాటరీ, డిస్ ప్లే పరంగా పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఫ్లిప్ కార్ట్ లో ప్రీ ఆర్డర్ ఇవ్వొచ్చు. కొన్ని రోజులు ఓపిక పడితే రిటైల్ స్టోర్లలోకి సైతం అందుబాటులోకి వస్తుంది.
ఈ ఫోన్ 6.7 అంగుళాల అమోలెడ్ స్క్రీన్, 120 గిగా హెర్జ్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో స్క్రీన్ కు ప్రొటెక్షన్ ఉంటుంది. స్క్రీన్ ప్రొటెక్టర్ ఫిల్మ్ ముందుగా అప్లయ్ చేసి ఉండదు. ఎక్సినోస్ 1380 చిప్ సెట్ పై పనిచేస్తుంది. నాలుగేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్ డేట్ ను ఉచితంగా ఇస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. అంతేకాదు, ఐదేళ్లపాటు సెక్యూరిటీ ప్యాచెస్ అందిస్తామని తెలిపింది.
ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 108 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా ఉంటుంది. దీనికి అదనంగా అల్ట్రావైడ్ కెమెరా, 2 మెగాపిక్సల్ మైక్రో సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో సెల్ఫీల కోసం 32 మెగాపిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ లో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఓ ప్రత్యేకతగా చెప్పుకోవాలి. దీనికి 25 వాట్ ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ ఉంటుంది. చార్జర్ ను కంపెనీ అందిస్తోంది. ఫోన్ పక్క భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఏర్పాటు చేశారు. ఫోన్ వెనుక ప్యానెల్ గ్లాసీగా, వెలుగులో రంగులు మారుతూ ఆకర్షణీయంగా కనిపిస్తోంది.