Train Accident: రైలు ప్రమాద మృతుల సంఖ్య 288... నిర్ధారించిన ఒడిశా ప్రభుత్వం
- ఈ నెల 2న ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం
- మృతుల సంఖ్యపై ఇప్పటిదాకా అనిశ్చితి
- కచ్చితమైన సంఖ్యను ప్రకటించిన ఒడిశా సీఎస్
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఈ నెల 2వ తేదీన జరిగిన ఘోర రైలు ప్రమాదం వందలాది మంది మృతికి కారణమైంది. కొందరు ప్రమాద తీవ్రతతో మరణించగా, మరికొందరు విద్యుత్ షాక్ తో మరణించారు. కాగా, ఈ భయానక రైలు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్యను 288గా ఒడిశా ప్రభుత్వం నిర్ధారించింది.
వాస్తవానికి ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 288 అని మొదటి నుంచి మీడియాలో వస్తోంది. అయితే ఒడిశా సర్కారు ఆ కథనాలను ఖండిస్తూ, రైలు ప్రమాదంలో మరణించింది 275 మందేనని ఇటీవల ఓ ప్రకటన చేసింది. అయితే, ఇప్పుడా ప్రకటనకు సవరణ చేసింది.
రైలు ప్రమాదంలో మొత్తం 288 మంది చనిపోయారని ఒడిశా రాష్ట్ర సీఎస్ ప్రదీప్ జెనా తెలిపారు. 205 మంది మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించామని వెల్లడించారు. రోడ్డు మార్గంలో మృతదేహాలను తరలించాలనుకుంటే అంబులెన్స్ లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రైలు మార్గంలో తరలించేవారికి అందుకు తగిన ఏర్పాట్లు చేశామని చెప్పారు. రవాణా చార్జీలను ఒడిశా ప్రభుత్వమే భరిస్తుందని సీఎస్ స్పష్టం చేశారు. 83 గుర్తు తెలియని మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.