Odisha: ఓ వ్యక్తి తల దూసుకొచ్చి నా ఛాతిని తాకింది: ఒడిశా భయానక దృశ్యాన్ని వెల్లడించిన యువకుడు
- ప్రాణాలతో బయటపడిన అసోంకు చెందిన రూపక్ దాస్
- కోరమాండల్ బోగీలోని ఎమర్జెన్సీ విండో నుండి బయటకు వచ్చిన యువకుడు
- కాసేపటికి మరో రైలు ఢీకొట్టడంతో తమ బోగీలోని వ్యక్తి తల ఫుట్ బాల్‌లా వచ్చి తన ఛాతిని తాకిందని వెల్లడి
- ఈ విషాద ఘటన తర్వాత ఇప్పటికీ అతను తేరుకోలేదు
ఒడిశాలోని బాలేశ్వర్ ట్రిపుల్ ట్రైన్ యాక్సిడెంట్‌లో ఒక్కొక్కరిది ఒక్కో దీనగాథ. కళ్లముందే ఘోరాన్ని చాలామంది చూసి చలించిపోయారు. ఈ ప్రమాదం నుండి బతికి బయటపడిన వారు తమ కళ్లముందు జరిగింది తలుచుకొని కంటతడి పెడుతున్నారు. ఈ ప్రమాదంలో అసోంకు చెందిన రూపక్ దాస్ అనే యువకుడు కూడా ప్రాణాలతో బయటపడ్డాడు. ఇతను ఆ రోజు నుండి భోజనమే చేయడం లేదట. కోరమాండల్ బోగీలో నుండి ప్రాణాలతో బయటకు వచ్చాక అదే బోగీలో ఉన్న ఓ ప్రయాణికుడి తల తెగి ఫుట్ బాల్ లా ఎగిరి తనపై పడిందని వాపోయాడు. ఈ ఘటన నుండి అతను ఇంకా తేరుకోలేదని డాక్టర్లు చెబుతున్నారు.
హఠాత్తుగా భారీ శబ్దం వచ్చిందని, రైలు పట్టాలు తప్పిందని భావించామని, కిటికీ నుండి బయటకు చూస్తే మా రైలు ఇంజిన్.. గూడ్స్ రైలు మీద ఉండటాన్ని గమనించామని సదరు అసోం యువకుడు చెప్పాడు. ఎమర్జెన్సీ గ్లాస్ ను పగులగొట్టి, తాను, మరో ఇద్దరం బయటకు వచ్చామని, కొద్ది క్షణాల తర్వాత బెంగళూరు - హౌరా ఎక్స్ ప్రెస్ రైలు వచ్చి కోరమాండల్ ను ఢీకొట్టిందని, దీంతో మా బోగి నుజ్జు నుజ్జు అయిందని చెప్పాడు. బోగీలోని ఓ వ్యక్తి తల తెగిపోయి ఎమర్జెన్సీ విండో నుండి ఫుట్ బాల్ లా బయటకు వచ్చి, తన ఛాతిని తాకిందని చెప్పాడు.