USA: బ్రిటన్ రాకుమారుడికి అమెరికా వీసా చిక్కులు!
- మాదకద్రవ్యాలు తీసుకున్నానంటూ బహిరంగంగా ప్రకటించిన బ్రిటన్ రాకుమారుడు హ్యారీ
- హ్యారీ ప్రకటనతో అమెరికా కోర్టులో హెరిటేజ్ ఫౌండేషన్ పిటిషన్
- మాదకద్రవ్యాలు వినియోగించిన వారిని అమెరికాలో ప్రవేశించేందుకు చట్టం ఒప్పుకోదని స్పష్టీకరణ
- హ్యారీకి వీసా జారీకి సంబంధించిన వివరాలు ప్రభుత్వం బహిరంగ పరచాలని డిమాండ్
బ్రిటన్ రాకుమారుడు హ్యారీని కూడా అమెరికా వీసా కష్టాలు చుట్టుముడుతున్నాయి. తాను మాదకద్రవ్యాలు తీసుకున్నానంటూ గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త చిక్కులు సృష్టించాయి. హ్యారీ వ్యాఖ్యల నేపథ్యంలో మంగళవారం వాషింగ్టన్లోని హెరిటేజ్ ఫౌండేషన్ స్థానిక కోర్టును ఆశ్రయించింది. బ్రిటన్ రాకుమారుడికి వీసా జారీపై మరిన్ని వివరాలు కోరుతూ మంగళవారం పిటిషన్ దాఖలు చేసింది.
అమెరికా, బ్రిటన్లలో ఉండగా నిషేధిత పదార్థాలను వినియోగించినట్టు హ్యారీ బహిరంగంగా వెల్లడించిన విషయాన్ని హెరిటేజ్ ఫౌండేషన్ తన పిటిషన్లో పేర్కొంది. మాదకద్రవ్యాలు వినియోగించే వారిని దేశంలోకి అనుమతించేందుకు అమెరికాలో చట్టాలు అంగీకరించవని కోర్టు దృష్టికి తెచ్చింది. కాబట్టి, విస్తృత ప్రజాప్రయోజనాల రీత్యా హ్యారీ వీసా వివరాలను అమెరికా అంతర్గతభద్రతా వ్యవహారాల శాఖ బహిరంగ పరచాలని కోరింది. అయితే, ఈ వివరాలను బహిరంగ పరిచేందుకు తప్పనిసరి కారణమేది లేదని అమెరికా ప్రభుత్వం తన వాదన వినిపించింది. ఈ పిటిషన్పై నేడు కోర్టు విచారణ జరపనుంది.
అమెరికా పౌరురాలైన మేఘన్ మెర్కల్ను రాకుమారుడు హ్యారీ పెళ్లాడిన విషయం తెలిసిందే. 2020 జనవరిలో రాచరిక బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్న హ్యారీ దంపతులు అమెరికాకు వచ్చేశారు.