Indian Origin: భారత సంతతి ఉపాధ్యాయురాలిపై బ్యాన్ విధించిన బ్రిటన్ పాఠశాలలు.. కారణమేంటంటే..!
- బ్రిటన్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా పని చేస్తున్న దీప్తి పటేల్
- బీమా నకిలీ క్లెయిమ్ ను దాచి ఉద్యోగంలో చేరిన దీప్తి
- విషయం బయటపడటంతో షాక్ అయిన పాఠశాల యాజమాన్యం
భారత సంతతికి చెందిన దీప్తి పటేల్ అనే ఉపాధ్యాయురాలిపై బ్రిటన్ స్కూల్స్ రెండేళ్ల పాటు నిషేధం విధించాయి. ఆమె ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా పని చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే, ఆమె 2018లో లండన్ నుంచి బోల్టన్ కు మకాం మార్చింది. తన ఇంటికి తుపాకీతో వచ్చిన కొందరు దుండగులు ఇంట్లో దోపిడీకి పాల్పడ్డారని ప్రస్తుతం పని చేస్తున్న పాఠశాలలో అబద్ధం చెప్పింది. ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పడానికి... ఇంట్లో దొంగిలించిన వస్తువులకు తన కుటుంబం బీమాను క్లెయిమ్ చేసినట్లు తెలిపింది.
అయితే, ఆమెపై ఇటీవల కోర్టు జరిపిన విచారణలో బీమా క్లెయిమ్ నకిలీదని నిరూపణ అయింది. దీప్తిపైనే దోపిడీ కేసు ఉందని వెల్లడయింది. వాస్తవానికి బీమా క్లెయిమ్ కేసు విచారణ కోసం కోర్టుకు వెళ్లినప్పుడు కూడా ఆమె స్కూల్లో అబద్ధం చెప్పే వెళ్లింది. ఈ విషయం బయటపడటంతో స్కూల్ యాజమాన్యం షాక్ కు గురైంది. టీచర్ల చెడు ప్రవర్తనపై చర్యలు తీసుకునే ఏజెన్సీకి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆమెపై రెండేళ్ల నిషేధం విధించారు.