Gujarati singer: గుజరాతీ గాయకుడికి చేదు అనుభవం.. రూ.40 లక్షల కారు అదృశ్యం
- హిమాచల్ ప్రదేశ్ నుంచి అహ్మదాబాద్ కు కారు రవాణా కోసం బుకింగ్
- కారును తీసుకెళ్లిన అగర్వాల్ ఎక్స్ ప్రెస్ ప్యాకర్స్
- మరింత మొత్తం చెల్లించాలంటూ బెదిరింపులు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన గాయకుడు బిన్నీ
ఏది కావాలన్నా.. గూగుల్ లో వెతికి, గుడ్డిగా ఫాలో అయిపోవడం. ఏ పోర్టల్ పడితే ఆ పోర్టల్ ను నమ్ముకోవడం సురక్షితం కాదని ఇటీవలి కాలంలో వెలుగు చూస్తున్న ఎన్నో ఘటనలు తెలియజేస్తున్నాయి. తాజాగా గుజరాత్ కు చెందిన గాయకుడు బిన్నీ శర్మ రూ.40 లక్షల విలువైన కారును పోగొట్టుకుని, సాయం చేయాలంటూ ఇన్ స్టా గ్రామ్ వేదికపై తోటి వారికి పిలుపునిచ్చారు.
తన ఎస్ యూవీ కారు (రూ.40 లక్షలు విలువ చేసే)ను హిమాచల్ ప్రదేశ్ నుంచి అహ్మదాబాద్ కు తరలించాలంటూ శర్మ ఓ వెబ్ సైట్ ద్వారా వెండర్ ను సంప్రదించాడు. ఇద్దరి మధ్య అంగీకారం కుదిరిన తర్వాత ఓ ట్రక్కు వచ్చి శర్మ కారును తీసుకెళ్లింది. ఆ తర్వాత వెండర్ శర్మ కారును గమ్యస్థానానికి చేర్చలేదు. ఇన్ వాయిస్ కంటే ఎక్కువ మొత్తాన్ని శర్మ నుంచి డిమాండ్ చేస్తున్నాడు. చివరికి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మూవ్ మై కార్ అనే పోర్టల్ లో నమోదైన వెండర్ ను నమ్ముకున్నప్పుడు శర్మకు ఎదురైన చేదు అనుభవం ఇది.
‘‘అగర్వాల్ ఎక్స్ ప్రెస్ ప్యాకర్స్ అండ్ మూవర్స్, మూవ్ మై కార్ పోర్టల్ కు వ్యతిరేకంగా సైబర్ పోలీసులకు, కన్జ్యూమర్ ఫోరమ్ కు ఫిర్యాదు చేశాను. మరింత మొత్తం చెల్లించకపోతే కారును డ్యామేజ్ చేస్తామంటూ బెదిరిస్తున్నారు. దీంతో పోలీసుల వద్ద ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయాలని అనుకుంటున్నాను. మూవ్ మై కార్, జస్ట్ డయల్, గూగుల్ యాడ్స్ తో జాగ్రత్తగా ఉండాలి’’ అని శర్మ సూచించారు.