Odisha train tragedy: 51 గంటల ఆపరేషన్.. దగ్గరుండి నడిపించిన రైల్వే మంత్రి
- ఎక్కడికక్కడ బృందాల నియామకం
- బాధితులకు మెరుగైన వైద్యం కోసం ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగింత
- క్షేత్రస్థాయిలో కెమెరాల సాయంతో పనుల పురోగతి పర్యవేక్షణ
- పూర్తయ్యే వరకూ నిరాటంకంగా పనిచేసిన రైల్వే మంత్రి
ఈ నెల 2న రాత్రి ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహానగ రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లూప్ లైన్ లో ఆగి ఉన్న గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్ ప్రెస్ 130 కిలోమీటర్ల వేగంతో ఢీకొట్టింది. బోగీలు పట్టాలు తప్పాయి. అదే సమయంలో మెయిల్ లైన్ లో వెళుతున్న యశ్వంత్ పూర్ హౌరా ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిన కోరమాండల్ బోగీలను ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటికి 288 మంది మరణించారు.
నాడు ప్రమాదం వార్త వెలుగు చూసిన కొన్ని గంటలకే రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ ఘటనా స్థలికి చేరుకున్నారు. అక్కడి నుంచి వేగంగా సహాయ, పునరావాస కార్యక్రమాలకు ఆదేశాలు ఇచ్చారు. ఒకప్పుడు బాలాసోర్ జిల్లాకు కలెక్టర్ గా పనిచేసిన సమయంలో, 1999లో భారీ తుఫాను ముప్పును సమర్థంగా ఎదుర్కొన్న అనుభవం ఆయనకు ఉంది. దీంతో విపత్తుల నిర్వహణపై ఆయనకున్న అవగాహన సాయపడింది. జరిగింది భారీ ప్రమాదం. పెద్ద సంఖ్యలో బాధితులు. కనుక పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక లేకుండా దాన్ని అధిగమించడం కష్టం. అధికారులతో మాట్లాడి, సాంకేతిక సమస్యలను అధిగమించే వ్యూహ ప్రణాళిక సిద్ధం చేశారు.
సాధారణంగా ప్రమాదాల సమయంలో అనుసరించాల్సిన ప్రణాళికపై రైల్వే శాఖ వద్ద తగిన సమాచారం ఉంటుంది. దీనికితోడు మంత్రి అశ్వని వైష్ణవ్ స్వయంగా రంగంలోకి దిగి మరింత మెరుగ్గా అమలు చేసే బాధ్యత తీసుకున్నారు. సాధ్యమైనంత మేర మరణాలను తగ్గించడం, బాధితులకు మెరుగైన చికిత్స అందించడం, వేగంగా పునరుద్ధరణ పనలు చేపట్టడం లక్ష్యాలుగా కార్యక్రమం కొనసాగింది. దీంతో 51 గంటల్లోనే రైలు సేవలను పునరుద్ధరించగలిగారు.
రైల్వే శాఖ నుంచి ఎనిమిది బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. ప్రతి రెండు బృందాలను సీనియర్ సెక్షన్ ఇంజనీర్లు వేర్వేరుగా పర్యవేక్షించారు. ఆ సీనియర్ సెక్షన్ ఇంజనీర్లపై డివిజనల్ రైల్వే మేనేజర్, జనరల్ మేనేజర్ పర్యవేక్షణ కొనసాగింది. వారిని రైల్వే బోర్డు సభ్యులు పర్యవేక్షించారు. బాధితులను వేగంగా ఆసుపత్రులకు తరలించడం, ఆసుపత్రుల్లో చేరిన వారికి మెరుగైన చికిత్స అందేలా చూసేందుకు కూడా మంత్రి ఆదేశాలు ఇచ్చారు. రైల్వే బోర్డు చైర్మన్ ను కటక్ హాస్పిటల్ కు, డైరెక్టర్ జనరల్ హెల్త్ ను భువనేశ్వర్ హాస్పిటల్ కు పంపించారు. నాలుగు కెమెరాలను క్షేత్రస్థాయి సిబ్బందికి అందించారు. ప్రమాద స్థలంలో సహాయక కార్యక్రమాల తీరును ఆ కెమెరాల సాయంతో సీనియర్ అధికారులు నిరంతరం పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు పురోగతిని మంత్రికి అందించారు. ఇలా అందరూ కలసి సమన్వయంతో వేగంగా ఆపరేషన్ ను పూర్తి చేశారు.