mexico: మెక్సికోలో దారుణం... కాల్ సెంటర్లో ఉద్యోగం మానేస్తున్నారని 8 మంది దారుణ హత్య!
- హింసాత్మక ముఠాగా పేరు గాంచిన జలిసో ఆధ్వర్యంలో నడుస్తున్న కాల్ సెంటర్
- కాల్ సెంటర్ కు చెందిన ఎనిమిది మంది అదృశ్యం
- సమీపంలో ప్లాస్టిక్ కవర్లలో బయటపడిన మృతదేహాలు
- చనిపోయిన వారిలో ఆరుగురు యువకులు, ఇద్దరు యువతులు
మెక్సికోలో దారుణం జరిగింది. ఓ కాల్ సెంటర్ లో ఉద్యోగం మానివేయడానికి సిద్ధమైన ఎనిమిది మంది యువతీ, యువకులను దారుణంగా చంపేశారు. అమెరికన్లను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్న మెక్సికోలోని ఓ డ్రగ్ కార్టెల్ లో జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిని అధికారులు నిర్ధారించారు..
మెక్సికో గవాడజరా సమీపంలోని జలిసో న్యూ జనరేషన్ కార్టెల్ ఆధ్వర్యంలో ఓ కాల్ సెంటర్ నడుస్తోంది. జలిసోకు హింసాత్మక ముఠాగా పేరు ఉంది. దీనికి సంబంధించిన కాల్ సెంటర్ లో పని చేస్తోన్న ఎనిమిది మంది ఉద్యోగులు కనిపించకుండా పోయారు. గత మే నెల 20 నుండి 22 మధ్య వీరు అదృశ్యమయ్యారు.
ఇందులో ఆరుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరంతా మూడు పదుల వయస్సు లోపు వారే. అదృశ్యమైన వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో శరీర భాగాలతో కూడిన కొన్ని ప్లాస్టిక్ కవర్లు అదే ప్రాంతంలో బయటపడ్డాయి. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించగా తప్పిపోయిన ఎనిమిది మందివి అని తేలింది.
జలిసో కాల్ సెంటర్ వంటి సాధారణ కార్యకలాపాలతో పాటు డ్రగ్స్ అక్రమ రవాణా, దోపిడీ, కిడ్నాప్ లకు కూడా పాల్పడుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరిట అమెరికన్లు, కెనడియన్లను లక్ష్యంగా చేసుకొని ఈ కాల్ సెంటర్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాఫ్తులో తేలింది. అయితే కాల్ సెంటర్ ఉద్యోగుల దారుణ హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. వారు ఉద్యోగం మానివేసేందుకు సిద్ధం కావడంతో ఈ హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.