Narendra Modi: రైతులకు కేంద్రం శుభవార్త... కనీస మద్దతు ధర భారీగా పెంపు!
- కేబినెట్ నిర్ణయాలను మీడియాకు తెలిపిన పీయూష్ గోయల్
- క్వింటాల్ వరికి మద్దతు ధర రూ.143 పెంపు
- అత్యధికంగా పెసరకు 10.4 శాతం మద్దతు ధర పెంపు
రైతులకు నరేంద్ర మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది ఖరీఫ్ లేదా వానాకాలం పంటలకు కనీస మద్దతు ధరల (MSP) పెంపునకు కేంద్రం బుధవారం ఆమోదం తెలిపింది. నివేదిక ప్రకారం, సాగుదారులు తమ ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలను పొందేలా, అలాగే పంటల వైవిధ్యతను ప్రోత్సహించడానికి... ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA) ఈ నిర్ణయం తీసుకుంది.
MSP అనేది ప్రభుత్వం రైతుల నుండి పంటలను కొనుగోలు చేసే కనీస ధరను సూచిస్తుంది. ధరల పతనానికి వ్యతిరేకంగా రైతులకు ఆర్థిక భద్రతను అందిస్తుంది. మార్కెట్‌లో అనూహ్య ఒడిదుడుకుల నేపథ్యంలో రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు MSP పెంపునకు కేంద్రం ఆమోదం తెలపడం కీలకమైన చర్యగా భావిస్తున్నారు. MSP అనేది నిర్దిష్ట వ్యవసాయ ఉత్పత్తులకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధర.
MSP పెంపుకు సంబంధించిన కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మీడియాకు వివరించారు. క్వింటాల్ సాధారణ వరికి మద్దతు ధరను రూ.143 పెంచింది. దీంతో వరి క్వింటాల్ ధర రూ.2,183కు చేరుకుంది. గ్రేడ్ ఏ వరికి రూ.163 పెంచడంతో రూ.2,203కు చేరుకుంది. గత ఏడాదితో పోలిస్తే కనీస మద్దతు ధరను ఎక్కువగా పెంచారు.
పెసరకు అత్యధిక MSPని పెంచారు. గత ఏడాది క్వింటాల్ పెసర ధర రూ.7,755కాగా, ఈసారి 10.4 శాతం పెంచడంతో రూ.8,558కి చేరుకుంది.
ఇక, హైబ్రిడ్ జొన్న క్వింటాల్ రూ.3,180, జొన్న రూ.3,225, రాగి రూ.3,846, సజ్జలు రూ.2500, మొక్కజొన్న రూ.2,090, పొద్దు తిరుగుడు రూ.6,760, వేరుశనగ రూ.6,377, సోయాబీన్ రూ.4,600, పత్తి మధ్యస్థాయి పింజ రూ.6,620, పత్తి పొడవు పింజ రూ.7,020 చొప్పున కనీస ధర నిర్ణయించింది.