YS Vivekananda Reddy: వివేకా రాసిన లేఖపై నిన్ హైడ్రిన్ టెస్టుకు సీబీఐ కోర్టు అనుమతి

CBI Court allows Ninhydrin Test to Viveka letter

  • వివేకా హత్య స్థలంలో దొరికిన లేఖకు నిన్ హైడ్రిన్ పరీక్ష
  • లేఖపై వేలిముద్రల నిగ్గు తేలనున్న వైనం
  • సీబీఐ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య స్థలంలో దొరికిన లేఖకు నిన్ హైడ్రిన్ టెస్టు జరిపేందుకు సీబీఐ కోర్టు నేడు అనుమతి మంజూరు చేసింది. లేఖపై వేలిముద్రలను అనుమానితుల వేలిముద్రలతో పోల్చాల్సి ఉందని, అందుకే నిన్ హైడ్రిన్ టెస్టుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ అధికారులు ఇటీవల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ అధికారుల వాదనలతో న్యాయస్థానం తాజాగా ఏకీభవించింది. 

హత్య స్థలంలో దొరికిన లేఖను సీబీఐ కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపడం తెలిసిందే. లేఖను 2021 ఫిబ్రవరి 11న సీబీఐ అధికారులు సీఎఫ్ఎస్ఎల్ కు పంపించారు. తీవ్ర ఒత్తిడితో వివేకా రాసిన లేఖగా సీఎఫ్ఎస్ఎల్ నిర్ధారించింది. 

లేఖపై వేలిముద్రలు కూడా గుర్తించాలని సీఎఫ్ఎస్ఎల్ ను సీబీఐ కోరింది. అయితే, లేఖపై వేలిముద్రల గుర్తింపునకు నిన్ హైడ్రిన్ పరీక్ష జరపాల్సి ఉంటుందని ఫోరెన్సిక్ ల్యాబ్ సీబీఐకి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే సీబీఐ అధికారులు కోర్టును ఆశ్రయించారు. తాజాగా, కోర్టు అనుమతి లభించిన నేపథ్యంలో, లేఖపై వేలిముద్రలు ఎవరెవరివి ఉన్నాయో నిర్ధారణ అయితే కేసు దర్యాప్తు మరింత ముందుకు జరగనుంది. 

అయితే, నిన్ హైడ్రిన్ పరీక్ష జరిపితే లేఖపై రాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉందని సీఎఫ్ఎస్ఎల్ చెబుతోంది.

  • Loading...

More Telugu News