Monsoon: చల్లటి కబురు.. కేరళను తాకిన రుతుపవనాలు
- ప్రకటించిన భారత వాతావరణ శాఖ
- ఇందుకు నిదర్శనంగా బుధవారం నుంచి కేరళలో వర్షాలు
- వారం రోజుల్లో రాయలసీమలోకి ప్రవేశం
- ఆలస్యం కావడం వర్షపాతంపై ప్రభావం చూపదంటున్న నిపుణులు
నైరుతి పలకరించింది. కొన్నిరోజులుగా దోబూచులాడుతున్న రుతుపవనాలు ఎట్టకేలకు గురువారం కేరళ తీరాన్ని తాకాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవనాల రాకకు నిదర్శనంగా బుధవారం కేరళ తీర ప్రాంతాల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. దీంతో రుతుపవనాలు వారం రోజులు ఆలస్యంగా ప్రవేశించినట్టయింది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం అయితే జూన్ 1నే రుతుపవనాలు ప్రవేశించాలి. కాకపోతే వారం రోజులు అటూ ఇటుగా రావడం సాధారణం. జూన్ 5 నాటికి రావచ్చని తొలుత భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అప్పటికీ రాకపోవడంతో, మూడు నాలుగు రోజులు ఆలస్యంగా వస్తాయని ప్రకటించడం తెలిసిందే.
ప్రముఖ ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ సైతం ఈ నెల 8, 9 వ తేదీల్లో రుతుపవనాలు కేరళ తీరాన్ని చేరతాయని అంచనా వేసింది. ఈ అంచనాలు నిజమయ్యాయి. నైరుతి రుతుపవనాలు మరో వారం రోజుల్లో రాయలసీమలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అక్కడి నుంచి రెండు మూడు రోజుల వ్యవధిలో రెండు తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించనున్నాయి. ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది నైరుతిలో వర్షపాతం సాధారణంగానే ఉండొచ్చన్నది వాతావరణ శాఖ అంచనా. కొంత తగ్గుముఖం పట్టొచ్చన్నది స్కైమెట్ అంచనాగా ఉంది. రుతుపవనాలు ఎంత మేర బలంగా ఉన్నాయనేది రానున్న రోజుల్లో తెలియనుంది.
నైరుతి రుతుపవనాలు 2022లో మే 29న కేరళ తీరాన్ని తాకాయి. 2021లో జూన్ 3న రాగా, 2020లో జూన్ 1నే వచ్చాయి. 2019లో జూన్ 8న, 2018లో మే 29న అడుగు పెట్టాయి. ఈ ఏడాది ఆలస్యంగా వచ్చినప్పటికీ, ఇతర ప్రాంతాల్లోకి ఆలస్యంగా విస్తరిస్తాయని అనుకోవడం సరికాదని నిపుణులు పేర్కొంటున్నారు. ఆలస్యంగా రావడం మొత్తం వర్షపాతంపైనా ప్రభావం చూపించదంటున్నారు.