Raghu Rama Krishna Raju: రఘురామకృష్ణరాజు వైద్య నివేదికలను భద్రపరచాలంటూ పిటిషన్.. కౌంటర్ దాఖలు చేయాలన్న హైకోర్టు
- రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో నివేదికలను ధ్వంసం చేసే యోచనలో అధికారులు
- కీలక ఆధారాలు ధ్వంసమైపోతాయంటూ పిటిషన్
- కౌంటర్ దాఖలు చేయాలంటూ గుంటూరు ఆసుపత్రి సూపరింటెండెంట్ కు హైకోర్టు ఆదేశం
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కు సంబంధించి దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో ఈరోజు వాదనలు జరిగాయి. అప్పట్లో సీఐడీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాల మేరకు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో రఘురాజుకు జరిగిన వైద్య పరీక్షల రిపోర్టులు భద్రపరచాలని కోరుతూ ఈ పిటిషన్ వేశారు. రఘురాజు తరపున న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు.
రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో నివేదికలను ధ్వంసం చేసేందుకు అధికారులు ప్రభుత్వ అనుమతి కోరారని కోర్టుకు లాయర్ తెలిపారు. ఇది జరిగితే ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు ధ్వంసమైపోతాయని... వీటిని భద్రపరిచి కోర్టుకు ఇవ్వాలని ఆదేశించాలని కోర్టును కోరారు. జనరల్ మెడిసిన్, రేడియాలజీ, కార్డియాలజీ వైద్యుల రిపోర్టులను భద్రపరచాలని కోరారు. వాదనలను విన్న హైకోర్టు లిఖితపూర్వకంగా కౌంటర్లను దాఖలు చేయాలని ఆరోగ్యశాఖ కమిషనర్, గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్, వైద్య విద్య డైరెక్టర్ లను ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 13వ తేదీకి వాయిదా వేసింది.