Housing prices: హైదరాబాదులోనే కాదు.. ఆ ఏడు నగరాల్లోనూ ఇళ్ల ధరలకు రెక్కలు
- జనవరి-మార్చిలో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో పెరిగిన ధరలు
- అధికంగా కోల్ కతాలో 11 శాతం పెరుగుదల
- నేషనల్ హౌసింగ్ బ్యాంక్ గణాంకాల్లో వెల్లడి
హైదరాబాద్ లో కొన్నేళ్ల నుంచి రియల్ రంగం దూసుకెళ్తోంది. భూములు, ఇంటి స్థలాలు, ఇళ్లు, అపార్ట్ మెంట్లకు భారీ డిమాండ్ నెలకొంది. వాటి ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఇళ్ల ధరలకు రెక్కలు వచ్చినట్టుగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ మాత్రమే కాదు దేశంలోని మరో ఏడు ప్రధాన పట్టణాల్లో ఇళ్ల ధరలు జనవరి–మార్చి మధ్య పెరిగినట్టు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ గణాంకాలు వెల్లడించాయి.
హైదరాబాద్ మార్కెట్లో ధరలు 7.9 శాతం మేర పెరిగాయి. కోల్ కతాలో అత్యధికంగా 11 శాతం పెరుగుదల కనిపించగా, తర్వాతి స్థానాల్లో అహ్మదాబాద్ (10.8 శాతం), బెంగళూరు (9.4 శాతం), పూణె (8.2 శాతం) ఉన్నాయి. చెన్నైలో 6.8 శాతం పెరగ్గా, ముంబైలో 3.1 శాతం, ఢిల్లీలో 1.7 శాతం పెరుగుదల కనిపించింది. మరోవైపు దేశవ్యాప్తంగా టాప్–50 పట్టణాల్లో ఏడు పట్టణాల్లోనే ఇళ్ల ధరలు తగ్గాయి.