COVID19: కేనర్స్కు మించి ఇబ్బందులు పెడుతున్న దీర్ఘకాల కొవిడ్
- కొవిడ్ నుంచి కోలుకున్న 3,750 మందిపై అధ్యయనం
- కేన్సర్ నాలుగో స్థాయిలో ఉన్నప్పటికి మించి అలసట
- మునుపటిలా పనిచేయలేకపోతున్నామని బాధితుల ఆవేదన
దీర్ఘకాల కొవిడ్‌తో బాధపడే వారిలో కేన్సర్‌కు మించి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం స్పష్టం చేసింది. లాంగ్ కొవిడ్‌తో బాధపడిన 3,750 మందిపై యూనివర్సిటీ కాలేజ్ లండన్ (యూసీఎల్), యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్‌కి చెందిన వైద్యులు పరిశోధనలు చేయగా ఈ విషయం బయటపడింది.
కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత అలసట, నిరాశ, ఆందోళన, మెదడు చురుకుదనం వంటి వాటిపై ప్రశ్నలకు దీర్ఘకాలిక కొవిడ్ బాధితుల నుంచి ఓ యాప్ ద్వారా సమాధానాలు సేకరించారు. వీరిలో ఎక్కువమంది అలసటతో బాధపడుతున్నట్టు అధ్యయనంలో వెల్లడైంది. ఊపిరితిత్తుల కేన్సర్ నాలుగో స్థాయిలో ఉన్నప్పుడు బాధితుడు ఎంతలా అలసటకు గురవుతాడో అంతకుమించి ఇబ్బంది పడుతున్నట్టు తేలింది.
యాప్‌లో వివరాలు నమోదు చేసిన వారిలో 90 శాతం మంది 18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్యవారు ఉన్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత మునుపటిలా పనిచేయలేకపోతున్నామని దాదాపు 51 శాతం మంది చెప్పారు. 20 శాతం మంది పూర్తిగా పనిచేయలేకపోతున్నట్టు పేర్కొన్నారు. అధ్యయన వివరాలు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ కేర్ రీసెర్చ్ (ఎన్ఐహెచ్ఆర్) జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. బాధితుల జీవితాలపై దీర్ఘకాలిక కొవిడ్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నట్టు తమ అధ్యయనంలో వెల్లడైనట్టు దీనికి నేతృత్వం వహించిన డాక్టర్ హెన్రీగుడ్ఫెలో తెలిపారు.