Revanth Reddy: కేటీఆర్ సవాల్ ను స్వీకరించిన రేవంత్ రెడ్డి
- కాంగ్రెస్ పదేళ్లు, బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనపై చర్చకు టీపీసీసీ చీఫ్ రెడీ
- కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు చెప్పిన రేవంత్
- కర్ణాటకలో గెలిచినట్లు తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమా
- బీఆర్ఎస్, బీజేపీలపై రేవంత్ రెడ్డి నిప్పులు
2004 నుండి 2014 వరకు, 2014 నుండి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలన్న మంత్రి కేటీఆర్ సవాల్ ను తాను స్వీకరిస్తున్నానని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. నాటి కాంగ్రెస్ పదేళ్లు, ఇప్పటి బీఆర్ఎస్ దాదాపు తొమ్మిదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, అధికార పార్టీ నుండి కేటీఆర్, హరీశ్ రావులు సిద్ధమా? అని ప్రతి సవాల్ విసిరారు.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని తాను ప్రజలను కోరుతున్నానని రేవంత్ చెప్పారు. అత్యంత కీలకమైన ఐదు అంశాలతో ప్రజల వద్దకు వెళ్తామని, కీలక నేతలు అందుబాటులో ఉండే అవకాశాన్ని బట్టి బహిరంగ సభలు ఉంటాయని చెప్పారు. కర్ణాటకలో గెలిచినట్లుగా తెలంగాణలోను కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.
2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్నారు. కేంద్రంలో మోదీని, రాష్ట్రంలో కేసీఆర్ ను గద్దె దించాలంటే యూత్ కాంగ్రెస్ క్రియాశీలకంగా పని చేయాల్సి ఉంటుందన్నారు. గడీల పాలనను పునరుద్ధరించేందుకు కేసీఆర్ ధరణి పోర్టల్ ను తీసుకు వచ్చారని ఆరోపించారు. కొద్దిమంది భూస్వాముల కోసమే ధరణిని తీసుకు వచ్చారని, అధికారంలోకి వచ్చాక దీనిని తాము కచ్చితంగా రద్దు చేస్తామన్నారు. వేల ఎకరాల భూమిని బినామీలకు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. అధికారుల వద్ద ఉండాల్సిన సమాచారం దళారుల చేతుల్లోకి వెళ్లిందన్నారు. ధరణి రాకముందుకు కూడా రైతు బంధు వచ్చిందని గుర్తు చేశారు.
పార్టీ కోసం, ప్రజల కోసం పోరాడే వారికి భవిష్యత్తు ఉంటుందని రేవంత్ చెప్పారు. బీజేపీ దృష్టిలో డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే డబుల్ ఇంజిన్ అంటే అదానీ, ప్రధాని అని ఎద్దేవా చేశారు. దేశాన్ని దోచుకోవడమే డబుల్ ఇంజిన్ సర్కారా అని నిలదీశారు. వన్ నేషన్, వన్ పార్టీ అనేది బీజేపీ రహస్య అజెండా అని ఆరోపించారు. బీజేపీ కుట్రను ఛేదించి రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నారు.