Ajinkya Rahane: డబ్ల్యూటీసీ ఫైనల్లో రహానే, శార్దూల్ ఠాకూర్ అద్భుత పోరాటం
- ఏడో వికెట్ కు అజేయంగా 108 రన్స్ జోడించిన వైనం
- సెంచరీకి చేరువైన రహానే
- లంచ్ బ్రేక్ వేళకు భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 6 వికెట్లకు 260 రన్స్
డబ్ల్యూటీసీ ఫైనల్లో అజింక్యా రహానే, శార్దూల్ ఠాకూర్ జోడీ అద్భుత పోరాటంతో టీమిండియా కొద్దిగా కోలుకుంది. ఆసీస్ బౌలర్ల ధాటికి టాపార్డర్ చేతులెత్తేయగా... రహానే, శార్దూల్ ఠాకూర్ ఏడో వికెట్ కు అజేయంగా 108 పరుగులు జోడించడంతో భారత్ కోలుకుంది.
మూడో రోజు ఆటలో లంచ్ విరామానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్లకు 260 పరుగులు చేసింది. నిలకడగా ఆడుతున్న రహానే సెంచరీకి చేరువయ్యాడు. రహానే 122 బంతుల్లో 89 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 11 ఫోర్లు, 1 సిక్సు ఉన్నాయి. ఈ క్రమంలో రహానే టెస్టుల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన భారత క్రికెటర్లలో రహానే 13వ వాడు.
మరో ఎండ్ లో శార్దూల్ ఠాకూర్ ఎంతో సహనంతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఠాకూర్ 83 బంతుల్లో 36 పరుగులు చేసి రహానేకు విశేష సహకారం అందించాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు భారత్ ఇంకా 209 పరుగులు వెనుకబడి ఉంది.
లండన్ లోని ఓవల్ మైదానంలో జరుగుతున్న ఈ టెస్టు సమరంలో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 469 పరుగులకు ఆలౌట్ అయింది.