KCR: ధరణి లేకపోతే ఎన్నో హత్యలు జరిగేవి: సీఎం కేసీఆర్
- మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
- ధరణి పోర్టల్ తో ఎంతో మేలు జరిగిందని వెల్లడి
- గ్రామాలు ప్రశాంతంగా ఉన్నాయని వివరణ
మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ భనవ సముదాయాన్ని సీఎం కేసీఆర్ నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ధరణి పోర్టల్ వల్ల ఎంతో మేలు జరిగిందని తెలిపారు. ధరణి లేకపోతే భూ వివాదాలతో హత్యలు జరిగేవని, ధరణి పోర్టల్ తీసుకురావడం వల్ల గ్రామాలు ప్రశాంతంగా ఉన్నాయని వివరించారు.
ధరణి రాకతో దళారులకు పనిలేకుండా పోయిందని అన్నారు. ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో విసిరేయాలంటున్న వారినే కట్టగట్టి బంగాళాఖాతంలో వేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
గతంలో రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లోనూ గొడవలు పడేవాళ్లని, ధరణితో భూసమస్యలు పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. రైతాంగం అభివృద్ధి చెందాలని, రైతాంగం బాధలు పోవాలనే ధరణి పోర్టల్ తీసుకురావడం జరిగిందని కేసీఆర్ స్పష్టం చేశారు.
"ఇవాళ తెలంగాణలో భూముల ధరలు ఎలా ఉన్నాయి? మారుమూల ప్రాంతాల్లోనూ ఎకరా రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలకు తక్కువలేదు. రోడ్డు పక్కన భూములు అయితే ఎకరా రూ.50 లక్షలు పలుకుతోంది. హైవే పక్కన భూములు అయితే రూ.1 కోటి-రూ.2 కోట్ల ధర ఉంది. ఇలాంటి వేళ ధరణి పోర్టల్ లేకుంటే ఎన్ని కొట్లాటలు జరిగేవి? ఎన్ని తలకాయలు పగిలేవి? ఎన్ని గట్టు పంచాయితీలు జరిగేవి? ఉన్న భూమిని ఇంకొకరి పేరు మీద రాయడం, మంచిగా చేయమంటే లంచాలు అడగడం... ధరణి రాకతో ఇవన్నీ తప్పాయి.
కానీ, ధరణి ఎత్తేయాలంటున్నారు. ధరణి పోతే మళ్లీ దళారుల రాజ్యం, పైరవీకారుల రాజ్యం, డబ్బులు గుంజేవారి రాజ్యం వస్తుంది. రైతులు ఇక పొలాలు, వ్యవసాయం చుట్టూ కాకుండా న్యాయవాదులు చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ధరణి లేకపోతే ఇలాంటి పరిస్థితే వస్తుంది. అందుకే ధరణిని బంగాళాఖాతంలో వేయాలంటున్నవారిని ప్రజలే బంగాళాఖాతంలో కలిపేయాలి" అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.